Aug 08,2021 22:19

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌కు హాజరుకావాలని, పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా, రైతాంగ సమస్యలతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగాలన్న తమ వాదనలను వినాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు తఅణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి డెరెక్‌ ఓబ్రియాన్‌ ఆదివారం 'మోడీజీ సభకు రండి.. ప్రతిపక్షాల వాదనను వినండి' అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఎం, టిఎంసి, డిఎంకె, ఎస్‌పి, శివసేన, ఆర్‌జెడి, ఎన్‌సిపి, అమాద్మీ, టిఆర్‌ఎస్‌ ఎంపిలు కేంద్రాన్ని నిలదీసిన అంశాలకు సంబంధించిన మూడు నిమిషాల వీడియోను జత చేశారు. మరో వారం రోజుల్లో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన అనంతరం ప్రారంభ వ్యాఖ్యల కోసం, కొత్త మంత్రులను సభకు పరిచయం చేసేందుకు ఒక సారి మాత్రమే సభకు హాజరయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు పెగాసస్‌, రైతాంగ సమస్యలపై చర్చ జరపాలంటూ నినాదాలు చేయడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రతిపక్షాలపై అసహనం వ్యక్తం చేసిన మోడీ మంత్రులను సభకు పరిచయం చేసినట్లుగా భావించాలని చెప్పారు. సాధారణంగా తన వద్దనే ఉంచుకున్న మంత్రిత్వశాఖలకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రధాని ప్రతి గురువారం సభకు హాజరౌతారు. మోడీ మాత్రం పార్లమెంట్‌ భవనంలోని తన కార్యాలయంలోనే కాలం గడిపేస్తున్నారు. ప్రతిరోజూ 10 గంటలకు మంత్రులతో భేటీ అవుతూ పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మాత్రమే పరిమితమౌతున్నారు. పార్లమెంట్‌ జరగకపోడానికి ప్రతిపక్షాలే కారణమంటూ ప్రచారం చేయాలని బిజెపి ఎంపిలకు సూచించారు. పెగాసస్‌ నిఘాపై సమాధాం చెప్పాలని పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన గతనెల 19 నుంచి ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం తగిన విధంగా స్పందించలేదు. అనధికార నిఘా సాధ్యం కాదన్న సర్కార్‌.. అసలు పెగాసస్‌ నిఘా చోటుచేసుకుందా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ సంకలన వీడియోలో ఉన్నాయి. పార్లమెంట్‌ ప్రారంభమైన నాటి నుంచి తమ డిమాండ్లను పట్టించుకోకుండా పలు బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని, ధైర్యం ఉంటే చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే సవాల్‌ చేయడం అందులో ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్‌ తూట్లు పొడుస్తోందని సిపిఎం ఎంపి జర్నాదాస్‌ బైద్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గోడును ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని ఎన్‌సిపి ఎంపి వందనా చవాన్‌ అన్నారు. ' పెగాసస్‌ ప్రతి ఇంట్లోకి చేరింది. దీనిపై మనం చర్చించాలి' అని ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో హత్యాచారానికి గురైన దళిత బాలిక ఘటనపై కేంద్రం పెదవి విప్పకపోవడం దారుణమని ఆప్‌ ఎంపి సుశీల్‌ కుమార్‌ గుప్తా విమర్శించారు. పార్లమెంట్‌లో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలని తృణమూల్‌ ఎంపి సుశేందు శేకర్‌ రారు పేర్కొనగా, ప్రభుత్వ తీరును డిఎంకె ఎంపి ఆర్‌ఎస్‌.భారతి తీవ్రంగా నిరసించారు.