- సిఐటియు ఆధ్వర్యంలో వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగ సంఘాల ధర్నా
ప్రజాశక్తి - కాకినాడ
రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో విలీనం చేయడాన్ని అపాలని, జీవో నెంబర్ 36 ప్రకారం పెరిగిన వేతనాలు 2019 నుంచి అమలు చేయాలని, జగన్ ప్రభుత్వం సహకార రంగంలో 50శాతం షేర్లు ప్రయివేటు యాజమా న్యాలకు ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని, సహకార రంగ ఉద్యోగుల గ్రాడ్యుటి పది లక్షలకు పెంచాలని, ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించి, సహకార పరపతి సంఘాలను ఇన్‌కమ్ టాక్స్ నుండి మినహాయించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించి కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సంఘం జిల్లా అధ్యక్షులు కె.ఆదినారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నరసరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావులు మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రుణాలు అందించడంలో, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం సేకరించడంలో సహకార రంగ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. జగన్ ప్రభుత్వం సహకార రంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ఉదోగుల అన్యాయం చేస్తూ, భవిష్యత్తులో రైతుల రుణమాఫీ చేసే అవకాశం లేకుండా ప్రయివేటీకరణ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రసహకార రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలు చేస్తుంటే రాష్ట్రంలో వైసిపి, టిడిపి ఎంపిలుఅందుకు మద్దతు తెలపడం రాష్ట్ర రైతాంగం చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. బిజెపి విధానాలకు రాష్ట్రంలో మద్దతు తెలిపేవారిని ఓడించి సహకార రంగాన్ని కాపాడుకోవాలని రైతులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సహకార రంగం ప్రయివేటీకరణ అయితే రైతుల రుణాలను రౌడీలను పెట్టి వసూలు చేసే పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. 2019లో జారీ చేసిన ఉద్యోగుల వేతన సవరణ జీవో 36ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనా కాలంలో అమలు చేయకపోవడాన్ని ఉద్యోగులు గుర్తుపెట్టుకొని ఎన్నికల్లో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా నాయకులు పి.తంబయ్య, అప్పలరాజు, కొలంక రాము, సత్యానందం, చిట్టియ్య, కొండబాబు, శివనాగ, పి.సాయిబాబు, పి.సుబ్బారావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ పాల్గొని మద్దతు తెలియజేశారు.
ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు, సిఐటియు నాయకులు










