Dec 16,2022 23:56

గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జెన్‌కో ఉన్నతాధికారులు

ప్రజాశక్తి -సీలేరు
డొంకరాయి పవర్‌ కెనాల్‌ మరమ్మతు పనులు చేపట్టడానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని సీలేరు కాంప్లెక్స్‌ ఎస్‌ఈ సివిల్‌ కేకేవి.ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి పడిందని వెంటనే అప్రమత్తమైన తమ సిబ్బంది సకాలంలో స్పందించి నీటిని నిలుపుదల చేసి చర్యలు చేపట్టడంతో పెనుముప్పు తప్పిందని తెలిపారు. విద్యుత్‌ సౌద ఉన్నతాధికారి ఆదేశాల మేరకు పవర్‌ కెనాల్‌ గండి పనులు చేపడానికి కావలసిన మెటీరియల్‌ తదితర యంత్ర సామాగ్రి సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కోటి రూపాయల నుంచి నుంచి కోటి 50 లక్షలు రూపాయలు ఖర్చు అవ్వచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. కెనాల్‌ గండి పనులు నెలరోజుల వ్యవధిలో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దిగు సీలేరు డొంకరాయిల జల విద్యుత్‌ కేంద్రంలో 20 మెగావాలు సామర్థ్యం గల ఒక యూనిట్‌, పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రాల్లో 115 మెగావాట్లు సామర్థ్యం గల నాలుగు యూనిట్లు ఉన్నాయని తెలిపారు. కెనాల్‌ గండి పనులు పూర్తయితే తప్ప ఈ రెండు జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని వెల్లడించారు. గురువారం హైడల్‌ డైరెక్టర్‌ ఎంవివి సత్యనారాయణ సీఈ సివిల్‌ శేషారెడ్డితో పవర్‌ కెనాల్‌ గండి పరిశీలించడం జరిగిందన్నారు. ఇంజనీర్లు పర్యవేక్షణలో నిరంతరం కెనాల్‌ గండి పనులు పూర్తయ్యే విధంగా కషి చేస్తామని ఆయన తెలిపారు.