ప్రజాశక్తి -సీలేరు
ఎపి జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ పరిధి డొంకరాయి పవర్ కెనాల్ గండ మరమ్మతు పనులు గురువారంతో పూర్తయినట్లు ఏపీ జెన్కో ఎస్‌ఇ (సివిల్) కెకెవి.ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. స్థానిక విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ 2022 డిసెంబరు 14 అర్ధరాత్రి డొంకరాయి పవర్ కెనాల్‌కు గండిపడిన విషయాన్ని గుర్తు చేస్తూ, దీని మరమ్మతు పనులు స్థానికంగా ఉన్న కాంట్రాక్టులకు పనులు అప్పగించినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి సుమారు నెలరోజుల్లో కెనాల్ బయట లోపల మరమ్మతు పనులు పూర్తి చేశామని తెలిపారు. ఏపీ జెన్కో ఉన్నతాధికారులు, సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో కెనాల్ లోపల భాగంలో నాణ్యత లోపాలు జరగకుండా కాంక్రీట్ పనులు పూర్తి చేశామని వెల్లడించారు. అనంతరం పవర్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అనంతరం కెనాల్ బయటి వైపు మట్టి పనులు, కాంక్రీట్ పనులు పూర్తి చేశామన్నారు. పవర్ కెనాల్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కెనాల్ అవుట్ సైడ్ భాగంలో రివీట్‌మెంట్ పనులు చేపట్టినట్లు తెలిపారు. పవర్ కెనాల్ నుంచి అవుట్ సైడ్‌కి వచ్చే ఊట నీరు వెళ్లేందుకు కాలువలుగా కాంక్రీట్‌తో ఏర్పాటు చేశామన్నారు. దీంతో పవర్ కెనాల్ మరమ్మతు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. పవర్ కెనాల్‌కు ముందు ముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం ఇంజనీర్లు పర్యవేక్షణలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పవర్ కెనాల్ మరమ్మతు పనులకు ఎంతో ఖర్చు అయిందో ఇంకా ధ్రువీకరించవలసి ఉందని వెల్లడించారు.










