Jul 15,2023 21:51

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆర్కే రోజా

పవన్‌కు ఫ్యాన్స్‌ మాత్రమే.. జగనన్నకు సోల్జర్స్‌ ఉన్నారు..
- సాంస్కృతిక, పర్యాటక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా
ప్రజాశక్తి - పగిడ్యాల

     పవన్‌ కళ్యాణ్‌కు ఫ్యాన్స్‌ ఉంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సోల్జర్స్‌ ఉన్నారని, జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చే వారు ఎంతో మంది ఉన్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. 'సిఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను పవన్‌ కళ్యాణ్‌ వాడు అని మాట్లాడాడు. అసలు వాడెవడు' అని మండిపడ్డారు. 'పవన్‌ కళ్యాణ్‌కు మెంటల్‌ వచ్చింది. మెంటల్‌ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చినవారు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. విప్లవకారుడినని పవన్‌ చెప్పుకోవడం సిగ్గుచేటు. విప్లవకారుడు అంటే ఎలా ఉంటారో తెలుసా' అని పవన్‌ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. 'రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన నువ్వు జగనన్న గురించి మాట్లాడడం సిగ్గుగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌కు ఆంధ్రలో ఇల్లు లేదు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు' అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి జగనన్న ఒక ఆట ఆడుకుంటారని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడా కార్యక్రమాలు చేపట్టి, క్రీడల అభివృద్ధి కోసం దాదాపు రూ. 5 కోట్లు ఖర్చు చేసి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నగదు బహుమతులు అందజేశామన్నారు. క్రీడాకారిణి పివి సింధు ఫటా ఫటా ఆట ఆడినట్టు సిఎం జగనన్న పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడులను ఆడుకొని వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి జెండా ఎగరేస్తుందన్నారు. అనంతరం శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైసిపిలో అవకాశం ఇచ్చారని, ఆయనకు ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, సర్పంచులను గెలిపించుకున్నామని తెలిపారు. నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.16 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, నియోజకవర్గానికి 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కూడా లక్షల్లో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. కొలనుభారతి, సంగమేశ్వరం ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని మంత్రి రోజాకు విన్నవించారు. నెహ్రూ నగర్‌ గ్రామంలోని కృష్ణానదిపై బోటు నడుపుకుంటూ జీవనం సాగించే వాళ్ళు ఉన్నారని, బోటు నడుపుకునే విధంగా వారికి అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.