Sep 17,2023 01:09

ప్రజాశక్తి - రేపల్లె
స్వార్ధ రాజకీయాల కోసం సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టొద్దని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సూచించారు. టీడీపి - జనసేన పొత్తుపై ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలలో కాపు సామాజిక వర్గానికి అత్యంత గుర్తింపు తెచ్చిన నాయకుడు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. చంద్రబాబు కాపులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నడని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు నేత వంగవీటి మోహన రంగా హత్య కేసులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం ద్వారా సొంత సామాజికవర్గానికి ఏ సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంభంపై చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పలు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన విషయం కాపులు మర్చిపోలేదని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి జైలులో ఉన్న చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఎక్కడలేని ప్రేమను ఓలకపోయటం విచారకరం అన్నారు. టిడిపి, జనసేన పొత్తులపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసం సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టవద్దని అన్నారు. జనసేన ప్రారంభ దశలో ఉందని అన్నారు. ఈ దశలో తప్పటడుగులు వేయవద్దని సూచించారు. సిఎం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై అన్యాయం జరిగిందంటూ వాస్తవాలను మరుగు పరిచేందుకు ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు ముఖంలో ఆనందం చూడటం కోసమే పవన్ పోరాటమని ఆరోపించారు. ప్రజల్లో సీఎం జగన్‌కున్న ఆదరణ చూసి పవన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. సీఎం జగన్ అంటే పవన్, చంద్రబాబు వణికిపోతున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు కావాల్సింది చంద్రబాబు మాత్రమేనని, జనసేన కార్యకర్తలు కాదని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం సిఎం జగన్‌ లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నది కనిపించడంలేదాని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన మోసాలు కనిపించలేదాని నిలదీశారు. కాపులను మోసం చేసేందుకు వారాహి యాత్ర చేపట్టారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన రూట్లో యాత్ర చేసే పవన్‌ చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమంపై కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో పవన్‌ను చూసి బాబుకు ఓటేస్తే కాపులకు ఏమి చేశారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ని ఎదుర్కేలేకే ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మండలి అంజయ్య పాల్గొన్నారు.