ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. శనివారం ఎయిర్‌పోర్టులో మంత్రులపై జరిగిన దాడి ఘటన తదనంతరం జనసేన నాయకులపై కేసులు, అరెస్టులతో ప్రశాంత విశాఖ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్ బసచేసిన నోవాటెల్ హోటల్ వద్ద లా అండ్ ఆర్డర్ డిసిపి పర్యవేక్షణలో సుమారు 2000 మంది పోలీసులు రెండు రోజులు భారీ బందోబస్తు నిర్వహించారు. పవన్ కల్యాణ్ విశాఖనుంచి వెళ్లాలని ఆదివారం మధ్యాహ్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు అభివాదం కూడా చేయరాదని ఆంక్షలు విధించారు. దీనిపై పవన్‌కల్యాణ్ విజయవాడ వెళ్లి గవర్నర్‌ను కలిసి విశాఖలో వైసిపి ప్రభుత్వం తన కార్యక్రమాలను అడ్డుకుంటుందని, పోలీసు అధికారులు వైసిపి ప్రభుత్వ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేస్తారని సోమవారం ఉదయం జనసేన నాయకులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. ఆయన వెంట నాగేంద్రబాబు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
వ్యవస్థలో తప్పులపై పోరాటం
'వ్యవస్థల్లో జరుగుతున్న తప్పులపై బలమైన పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పునూ ఎండగడదాం. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందాం. పార్టీపక్షాన లీగల్ టీమ్ భరోసాగా నిలుస్తుంది' అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారని అరెస్టు అయి విడుదలైన జనసేన పార్టీ నాయకులు తెలిపారు. శనివారం ఎయిర్‌పోర్టు వద్ద ఘటనతో పోలీసులు అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొందరికి బెయిల్ లభించడంతో సోమవారం వారు హోటల్‌లో పవన్ కల్యాణ్‌ను కలిశారు. పార్టీ అండగా ఉంటుందని వారికి పవన్‌కల్యాణ్ భరోసా ఇచ్చారు. అరెస్టయిన వారి పట్ల స్టేషన్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. జనసేన లీగల్ టీమ్ న్యాయపరంగా పోరాడుతుందని, మిగిలిన వారికి కూడా త్వరగా బెయిల్ వచ్చేలా చూస్తామని పవన్ కల్యాణ్‌ను హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
9 మందికి 14 రోజుల రిమాండ్
విశాఖ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగిన ఘటనపై వైసిపి ఫిర్యాదు మేరకు జనసేనకు చెందిన 70 మందిని పోలీసులు అరెస్టుచేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. కోన తాతారావు, సుందరపు విజరు కుమార్, పంచకర్ల సందీప్, కొల్లూరి రూప, పీతల మూర్తియాదవ్, పివిఎస్‌ఎన్.రాజు, చింతపల్లి శ్రీను, బోగి శ్రీనివాస పట్నాయక్, రాయపురెడ్డి కృష్ణకు మెజిస్ట్రేటు 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ 9 మందిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన 61 మందిని రూ.10,000 సొంత పూచీకత్తుపై కోర్టు విడుదల చేసింది.










