Jul 11,2023 21:58

సాలూరు: నిరసన తెలుపుతున్న వాలంటీర్లు

ప్రజాశక్తి - సాలూరు : వాలంటీర్లనుద్దేశించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం పట్టణంలోని వార్డు వాలంటీర్లు బోసుబొమ్మ జంక్షన్‌లో ధర్నా చేశారు. జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, వైసిపి పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు ఆధ్వర్యాన వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, పట్టణాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ కొల్లి వెంకటరమణ,వాలంటీర్లు పాల్గొన్నారు.
మండలంలోని బాగువలస, పెదపదం, నాలర్లవలసలో వాలంటీర్లు పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను దగ్ధం చేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ కుమార్‌, సర్పంచ్‌ రెడ్డి సుకన్య ఆధ్వర్యాన వాలంటీర్లు నిరసన తెలిపారు.
కురుపాం : వాలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ వ్యాఖ్యలపై కురుపాంలో సచివాలయం నుండి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. పవన్‌ కళ్యాణ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పవన్‌ కళ్యాణ్‌ చిత్రపటాలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కురుపాం మండలంలో గల వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు.
సీతానగరం : వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని స్థానిక హనుమాన్‌ జంక్షన్‌లో మానవహారం చేసి అనంతరం బజార్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌ : స్థానిక ఆర్టీసీ కూడలిలో వాలంటీర్లు మానవహారంగా ఏర్పడి, పవన్‌ కల్యాణ్‌పై నిరసన పోస్టర్లు ప్రదర్శించి, దిష్టి బొమ్మలు తగలబెట్టి తమ నిరసన తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.వీరఘట్టం : స్థానిక అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాన వహారం చేపట్టి పవన్‌ కళ్యాణ్‌ నున్న కార్డును చెప్పులతో కొట్టి చించి వేసి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలం టీర్లు పాల్గొన్నారు.