ప్రజాశక్తి-హిందూపురం : పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అని రాజకీయాలపై అవగాహన లేకుండా సమాజంపై బాధ్యత లేని వ్యక్తిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. శుక్రవారం హిందూపురం పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు. ఏడవ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు ఫయాజ్ నివాసంలో ఆయన మాట్లాడుతు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉంటున్న వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసేందుకు టీడీపితో కుట్ర పన్ని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్రం, ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని ఆదర్శంగా తీసుకుంటుంటే ఈ వ్యవస్థ గురించి చులకనగా మాట్లాడడం దారుణమన్నారు. అధికార పార్టీపై ప్రతిపక్షాల విమర్శలు సహజమని అయితే అవి నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యవస్థలను ధ్వంసం చేసేలా ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ, అయూబ్ కిరోసిన్ బాబు, కో ఆప్షన్ మెంబర్ రహమత్, వైసీపీ నాయకులు లతీఫ్ సెట్, సోమశేఖర్ రెడ్డి, మార్కెట్ చాంద్‌బాషా, ఇలియాజ్, రమణ తదితరులు పాల్గొన్నారు.










