Jul 11,2023 21:38

నిరసన తెలుపుతున్న వాలంటీర్లు

వాల్మీకిపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వాలంటీర్లు భగ్గుమన్నారు. మంగళవారం పట్టణంలో వాలంటీర్లు పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం స్థానిక గాంధీ బస్టాండ్‌ వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తాము అందిస్తున్న నిస్వార్థసేవలు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందించాలనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా అందుబాటులోకి తెచ్చిన వాలంటీర్‌ వ్యవస్థపై విషం చిమ్మడాన్ని తప్పుబట్టారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఇంటింటికి వెళ్లి సేవలందించిన వాలంటీర్లు కనిపించలేదా అంటూ ధ్వజమెత్తారు. మండలంలోని చింతపర్తిలో వాలంటీర్లు పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనలు వ్యక్తం చేసి, స్థానిక ఎస్‌ఐ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు.