Mar 14,2023 23:02

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పాల్గొనేందుకుగాను విజయవాడ ఆటోనగర్‌ నుండి పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి వాహనం ద్వారా బయలురేరారు. దీనితో మంగళవారం మధ్యాహ్నం నుండి బెంజిసర్కిల్‌ నుండి పటమట, ఆటోనగర్‌ వరకు భారీ స్థాయిలో వాహనాలు స్థంబించిపోయాయి. ఒక దశలో ట్రాఫిక్‌ను మళ్లించడంతో ప్రధానమైన రహదారి కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భారతీనగర్‌లోని నోవాటెల్‌ హౌటల్‌ నుండి జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ బయలుదేరి ఆటోనగర్‌కు చేరుకున్నారు. ఆటోనగర్‌ వద్ద వారాహి వాహనం నుండి బయలుదేరారు. దీనితో పవన్‌ కళ్యాణ్‌ను చూసేందుకు పెద్ద స్థాయిలో నగర వాసులు, అభిమానులు, స్థానికులు రావడంతో సుమారు అరగంటకు పైగా ట్రాఫిక్‌ స్థంబించిపోయింది. ముఖ్యంగా యువత బస్సులపై ఎక్కి తమ అభిమాన నాయకుడిని చూడటానికి ఉత్సాహం చూపారు. దీనితో పాటు పెద్ద స్థాయిలో ర్యాలీలతో బెంజిసర్కిల్‌ ప్రాంతం నుండి స్థానికులు బయలుదేరి వెళ్లారు.