'నవ్వడం ఒక భోగం/ నవ్వించడం ఒక యోగం/ నవ్వకపోవడం ఒక రోగం' అంటాడు జంధ్యాల. గతంలో అసెంబ్లీలో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే ఓ ప్రతిపక్ష నాయకుడ్ని ఉద్దేశించి అప్పటి ముఖ్యమంత్రి పదేపదే ఈ డైలాగ్ చెబుతూ ఇంకా పాపులర్ చేశారు. ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ... గడపగలిగితే మంచి వాతావరణాన్నిస్తుంది. మంచి సమాజాన్నీ ఇస్తుంది. కనుకనే చిరునవ్వును మానవ భాషగా అభివర్ణిస్తారు. అది వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. మనోభావాల మాధ్యమం. సంస్కారానికి సజీవ రూపం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకోగల శాంతి సంకేతం. అందుకే అంటారు... 'భాష లేని మాధ్యమం చిరునవ్వు' అని. హృదయాలను కదిలిస్తుంది. జీవితాన్ని అందంగా మార్చుతుంది. ముఖానికి చిరునవ్వును మించిన అలంకారం లేదు. భావవ్యక్తీకరణలో చిరునవ్వు ప్రధానమైన సాధనం. చిరునవ్వుకి మించిన ఆభరణం... ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం... ఈ ప్రపంచంలో మరొకటి లేదు. 'నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ/ నవ్వుతూ చావాలిరా/ చచ్చినాక నవ్వలేవురా/ ఎందరేడ్చినా బతికిరావురా' అంటాడు సినీకవి ఆత్రేయ. అలాగే నవ్వుపైన సినిమాల్లోనూ వందలాది పాటలున్నాయి. ఇవ్వనీ నవ్వులోని హాయిని, ఉత్సాహాన్ని నింపేవే. నిత్యం మోముపై ఓ చిరు నవ్వు మొలకలేస్తే... ఆ మనిషిలో ఆరోగ్యం ఉరకలేస్తున్నట్టే. అలా అందరూ ఉండగలిగితే ఆ సమాజం అంతా ఆనందమయం.
ఆధునిక జీవితమంతా ఉరుకుల పరుగుల మయం. ఈ పోటీ ప్రపంచంలో వేగంగా సాగకుంటే జీవితమే వ్యర్థమనే ఒక కృత్రిమ పోటీని తీసుకొచ్చింది ప్రపంచీకరణ. కోవిడ్‌తో ఒత్తిడి మరింత పెరిగింది. విద్యార్థులపై ఆన్‌లైన్ చదువుల ఒత్తిడి. గహిణులపై వేళాపాళా లేని ఇంటి పని ఒత్తిడి. ఇంటి యజమానిపై ఉద్యోగం, వ్యాపారం వంటి బాధ్యతల ఒత్తిడి... ఇలా ప్రతి ఒక్కరూ తీరిక లేని ఒత్తిడితో క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నారు. దీంతో ఆనందం కరువైంది... ముఖంలో నవ్వు మాయమైంది. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా ఒకదగ్గర కూర్చొని సరదాగా నవ్వుకోవడం అరుదైన దృశ్యంగా మారింది. రోజుకు రూ.1002 కోట్లు సంపాదించే అదానీ నవ్వు వెనుక... కోట్లాది మంది అర్థాకలి బతుకులు... ఆకలి రోదనలు వున్నాయి. వీరందరూ ప్రశాంతంగా ఎలా నవ్వుతారు ? నిరాశ నిస్పృహలకు, ఆందోళనలకు లోనవుతున్న మనిషి... నిత్యజీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. జీవన శైలిలో యంత్రాలు భాగమైనట్లే... వ్యక్తిగత జీవితంలోనూ యాంత్రికత భాగమైపోయింది. క్రమేణా జీవితంలో నవ్వు కనుమరుగై పోతున్నది. వస్తువుగా మారిపోయి... పరిమళంలేని ప్లాస్టిక్ పూవుల్లా జీవంలేని నవ్వొకటి ముఖాన తగిలించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
మనకు కావాల్సింది జీవంలేని ఈ కృత్రిమ నవ్వులు కాదు. పెదాల మధ్య స్వచ్ఛమైన పువ్వుల్లా విచ్చుకునే చిరునవ్వు కావాలి. మనకు సినిమాల్లోను, టీవీల్లోనూ హాస్య సన్నివేశాలకు ప్రాధాన్యతనిస్తుంటాం. అందుకే జబర్దస్త్ లాంటి కామెడీ ప్రోగ్రామ్‌లు విజయవంతం అవుతున్నాయి. 'పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్' అన్నట్లుగా... హాస్యం చిరునవ్వులను పండిస్తుంది. ఆ హాస్య కార్యక్రమాలను చూస్తున్నంతసేపు తమ బాధలను మర్చిపోయి... తిక్కన చెప్పినట్లుగా 32 రకాల నవ్వులు కాకపోయినా హాయిగా చిరునవ్వు మాత్రం కచ్చితంగా నవ్వుకుంటారు. అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచీకరణ విధానాలు ముందు మొదలయ్యాయి. అందుకే మిగతావారికంటే బాధలు కూడా మనకే ముందు మొదలయ్యాయి. ఈ బాధలు, కష్టాలను మర్చిపోయి, రేపటికోసం మళ్లీ ఉత్సాహాన్ని నింపుకోడానికి ఇలాంటి హాస్యం టానిక్‌లా ఉపయోగపడుతుంది. అంతేకాదు... చిరునవ్వు మనిషికి హుందాతనాన్నిస్తుంది. అందరూ హాయిగా వుండే ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తుంది. అటువంటి రోజు కోసం చాలా మంది తమ నవ్వులను కూడా మర్చిపోయి, పోరాడుతున్నారు... త్యాగాలు చేస్తున్నారు. కొద్దిమంది శత కోటీశ్వరులు మాత్రమే నవ్వుకుంటే చాలదు. అందరూ ప్రశాంతంగా నవ్వుకోగలిగే సమాజం కావాలి. ప్రతి వ్యక్తి మోమున చిరునవ్వులు మెరవాలి. చైతన్యయుత సమాజం కోసం పోరాటాల సాగు చేస్తున్న వారికి ఈ చిరునవ్వులు ప్రేరణగా నిలవాలి. 'ప్రపంచ స్మైల్ డే'కు నిజమైన అర్ధం అప్పుడే సిద్ధిస్తుంది.










