ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై దంపతులకు ప్రశాంతి నిలయంలో ఘనస్వాగతం లభించింది. బెంగళూరు నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్ దంపతులు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డిఎస్‌పి వాసుదేవన్, ఆర్డీవో భాగ్యరేఖ, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్, తహశీల్దార్ నవీన్ కుమార్ తదితరులు గోవా గవర్నర్‌కు స్వాగతం పలికారు. పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ దంపతులు సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కేరళీయులు జరుపుకుంటున్న ఓనం పండుగ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. కేరళీయులు తమ సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగను జరుపుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నర్ దంపతులు తిరిగి కారులో రోడ్డు మార్గాన కర్నాటక రాష్ట్రంలోని చిక్ బలాపురానికి బయలుదేరి వెళ్లారు.










