Oct 07,2023 22:08

బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి

       పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి నుంచి నల్లమాడ, వయా ఓడిసి, అమడగూరు, కొక్కంటి క్రాస్‌ మీదుగా మదనపల్లికి నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం నాడు ఆర్టీసీ బస్టాండులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులు కోరిన విధంగా నూతన బస్సులను ఆర్టీసీ ద్వారా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మారుమూల మండలాల నుంచి మదనపల్లికి బస్సు వెళ్లడం ద్వారా ప్రయాణికుల రాకపోకలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. డిపో మేనేజర్‌ ఇనయతుల్లా మాట్లాడుతూ పుట్టపర్తి నుంచి ఈ సర్వీసు మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:45 గంటలకు మదనపల్లికి చేరుకుంటుందన్నారు. మదనపల్లిలో సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:00 గంటలకు ఆమడగూరు చేరుకుని రాత్రి అక్కడే ఉంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు అమడగూరులో బయలుదేరి 7:00 గంటలకు మదనపల్లికి చేరుకుంటుందన్నారు. 7:30 గంటలకు మదనపల్లిలో బయలుదేరి పైమండలాల మీదుగా పుట్టపర్తికి 11:45 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టిఐ పెద్దన్న, ఆర్టీసీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.