''పుట్టిన రోజు కానుకగా నాకు సైకిల్ కావాలి'' అని మారాం చేశాడు యాదగిరి. ఆ అల్లరి భరించడం తల్లిదండ్రులకు చాలా కష్టం అయ్యింది.
''మన దగ్గర సైకిలు కొనేంత డబ్బులు లేవు. పోనీ, ఏదోలా కొందామన్నా ఇప్పుడు కూలి పనులు సరిగ్గా దొరకడం లేదు.'' అన్నాడు తండ్రి.
''నువ్వు సారా తాగటం మానేస్తే ఆ డబ్బు మిగులుతుంది కదా?'' అన్నాడు యాదగిరి. ''నాకు అది అలవాటు అయిపోయింది. తాగకపోతే చెయ్యి వణుకుతాది. ఆ కాస్తా డబ్బులు రోజువారీ సారా ఖర్చులకి ఉంచుకోనీ బిడ్డా'' అన్నాడు తండ్రి సింహాద్రి.
''ఇది కరోనా కాలం. సైకిల్ గురుంచి మారాం చెయ్యకు. ఉన్న తక్కువ డబ్బులు అయ్య సారా ఖర్చుకి చాలవు. ఇక నిత్యావసర సరుకులు కొనలేక ఇల్లు ఎలా గడిపేది. అదే నా దిగులు!'' అంది తల్లి లచ్చుమమ్మ.
''నా మాట మీరు వింటే... మీ మాట నేను వింటాను'' అన్నాడు యాదగిరి.
''అలాగే'' అని ప్రమాణం చేశారు తల్లి తండ్రి.
''జీవితంలో నేను పుట్టిన రోజు కానుకలు కోరను. ఇప్పుడు సైకిలు కొనక్కర్లేదు. నాన్న ఇక సారా తాగనని ప్రమాణం చేయాలి'' అన్నాడు యాదగిరి. కాసేపు ఆలోచించి, సరే అని ఒట్టు వేశాడు తండ్రి.
యాదగిరి నిత్యావసర సరుకులు జాబితా తయారు చేసుకొని ఇంట్లో ఉన్న ఆ కాస్తా డబ్బులు పట్టుకొని బజారు వైపు అడుగులు వేశాడు. కావాలనే ఒక పేచీ పెట్టి తండ్రి చెడు అలవాటును మానడానికి సిద్ధం చేశానన్న తప్తి కనిపించింది అతని మోములో. అదే తన పుట్టినరోజు కానుక అనుకున్నాడు.
- ఎం వి స్వామి
94415 71505