హడావిడిగా ఇడ్లీలు తింటున్న సారథి.. అప్పుడే కొత్త డ్రస్ వేసుకు వచ్చి, నిలబడ్డ అనిమేశ్‌ని అబ్బురంగా చూసుకున్నాడు. పద్దెనిమిది నిండిన కొడుకు అతడి కళ్లకి ఇంకా పసి వాడిగానే కనిపించాడు.
'హ్యాపీ బర్త్ డే అన్నూ!' అన్నాడు ఆర్ద్రంగా.
'నాకు అర్జంట్ కాల్ ఒకటుంది. అందుకే, టిఫిన్ చేసేస్తున్నాను!'.
'ఓకే, థాంక్ యూ నాన్నా!' అన్నాడు అనిమేశ్ తనూ డైనింగ్ టేబుల్ దగ్గర, తండ్రి ముందు కూర్చుంటూ.
'ఆఫీస్‌కి వెళ్తున్నప్పటికన్నా బిజీ అయిపోయారు మీరు ఈ లాక్‌డౌన్‌లో ఇంటి నుండి పని పేరుతో!' కొడుక్కి పాయసం తెచ్చి, అందిస్తూ అంది సత్యవతి నిష్టూరం కలిపిన నవ్వుతో.
సారథి జవాబేం చెప్పలేదు, చిరునవ్వుతో సరిపెట్టాడు. కాఫీ ఆఖరి గుక్క తాగుతుండగానే మోగిన ఫోన్ చూసుకుంటూ, హడావిడిగా లేచి, తన గదిలోకి వెళ్ళిపోయాడు.
టిఫిన్ తినటం పూర్తి కాగానే, స్పోర్ట్స్ షూస్ వేసుకుంటున్న కొడుకుతో 'ఇవేళ ఆ సైక్లింగో, జాగింగో తొందరగా ముగించుకుని రా. నీ కోసం స్పెషల్స్ చేస్తున్నాను!' అంది సత్యవతి.
ఒక్క క్షణం తల్లి ముఖంలోకి చూసి, ఆమెని దగ్గరకు తీసుకుని, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అనిమేశ్!
'ఇవాళ నా బర్త్ డే గ్రాండ్‌గా జరుగబోతోంది!'
'కరోనా కట్టడిలో గ్రాండ్ సెలబ్రేషన్...?!' వెక్కిరింపుగా నవ్వింది సుప్రజ.
'మనసుండాలి గానీ, మార్గమే దొరకదా?' చెల్లెలికి జవాబిచ్చాడు అనిమేశ్.
'కానీ, ఆ మార్గం నిండా పోలీసులుంటారు!' రిటార్టిచ్చింది సుప్రజ.
చెల్లెలి నెత్తిన మొట్టి, బయటకు నడిచాడు అనిమేశ్.
వాళ్ళుంటున్న ఆ రెండెకరాల ట్విన్ టవర్ గేటెడ్ కమ్యూనిటీ గ్రీన్‌జోన్‌లోనే ఉండటాన, కరోనా నిబంధనల మధ్య కూడా, కాంపౌండ్ లోపల ఉన్న గార్డెన్‌లోనూ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లోనూ దూరాన్ని పాటిస్తూ, తిరిగే వెసులుబాటు ఉంది. రోజూ ఉదయం ఒక రెండు గంటల పాటు అలా తిరగటం అనిమేశ్ దినచర్య.
పన్నెండు గంటలు దాటుతుండగా, వంట పూర్తిచేసుకున్న సత్యవతి భర్త గదిలోకి వెళ్ళింది. జూమ్ మీటింగ్‌లో ఉన్న సారథికి సైగతోనే 'భోజనం తయార్!' అన్న సిగలిచ్చింది. ఆ మాట ఆయన చెవిన వేస్తే, ఆయన వీలు కుదరగానే, లేచి వస్తాడు. సారథి కూడా చేత్తోనే జవాబిచ్చాడు ఒంటి గంటకి వస్తానని.
సత్యవతి హాల్లోకి వచ్చేసింది. 'వీడింకా రాలేదు' అనుకుంది, కొడుకుని తలుచుకుంటూ.
అప్పుడే స్నానం చేసి, తయారై వచ్చిన కూతురితో 'మీ అన్నయ్య ఇంకా రాలేదు చూడు!' అంది.
'వాడికి తెలుసు, నాన్న ఒంటిగంటదాకా లంచ్‌కి రారని. వాడూ అప్పటికే వస్తాడు!' తేలిగ్గా అంది సుప్రజ.
'ఏమిటే, పొద్దున ఎనిమిది కాకుండానే వెళ్ళినవాడు, ఇంతసేపు సైక్లింగా?'
'పుట్టినరోజు కదా! పాపం ఎటూ బయటకి వెళ్ళలేడు. ఫ్రెండ్స్‌తో గార్డెన్‌లో కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు!'
'ముందే చెప్పవచ్చుగా అలాగని!'
'ముందుగా అనుకుని ఉండడులే!'
'ఫోన్ చెరు వాడికి, ఇక రమ్మను!' అరిచింది సత్యవతి.
మొబైల్‌లో రింగ్ చేసింది సుప్రజ. 'అవుటాఫ్ రీచ్ అని వస్తోంది!' చెప్పింది తల్లితో. సత్యవతి సహనం కోల్పోయింది.
'ఇంటర్‌కమ్‌లో సెక్యూరిటీ అబ్బాయికి చెప్పు, వాడు ఎక్కడ కూర్చున్నా, వెంటనే ఇంటికి పంపమని!' కూతురికి పురమాయించి, తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
అయిదు నిమిషాల తరవాత, నెమ్మదిగా వంటగదిలోకి వచ్చింది సుప్రజ మొహం వేలాడేసుకుని.
'అన్నయ్య కాంపౌండ్‌లో ఎక్కడా కనిపించలేదటమ్మా!'
కొద్దిగా కంగారు పడింది సత్యవతి. తమ టవర్స్‌లోనే ఉన్న అనిమేశ్ స్నేహితుల ఫ్లాట్‌లకి కాల్ చేసింది. అవతలి నుంచి వచ్చిన జవాబులన్నీ ఒక్కలాగే ఉన్నాయి.
'ఇవేళ మీ అబ్బాయి పుట్టినరోజు మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారనీ, మీ ఇంట్లోనే ఉంటామనీ చెప్పి వెళ్ళాడే మావాడు. మీ ఇంట్లో లేడా?' గుండె ఆగినంత పనయింది ఆమెకి.
సత్యవతి కాల్స్ మిగతా అయిదుగురి ఇళ్లలో కూడా బాంబులు పేల్చాయి.
'ఏమైపోయారు వీళ్లు? ఎక్కడికి వెళ్ళారు?' మెయిన్ గేట్ సెక్యూరిటీలో కనుక్కున్నారు.
ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఒకరొకరుగా, అందరూ బయటకు వెళ్ళారని తెలిసింది.
తండ్రులంతా సారథి ఇంటికి వచ్చి, అతడిని నిలదీశారు. సారథిó దగ్గర జవాబు లేదు!
'పోలీస్ కంప్లయింట్ ఇద్దామా!' అనుకున్నారు. అర్థం లేని పని అనిపించింది. కట్ట గట్టుకుని, కావాలని వెళ్ళినవాళ్ళ గురించి, పోలీస్ కంప్లయింట్ ఏమని ఇస్తారు?
'ఈ కరోనా కాలంలో మద్యం దుకాణాలు తెరవటం ప్రభుత్వం చేసిన పొరబాటు!' ఒక తండ్రి నిష్టూరంగా అన్నాడు.
'మీ వాడు పుట్టినరోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడన్న మాట! అయినా, నగరమంతా ఇంత బందోబస్తు ఉండగా, ఎక్కడ కూర్చొని తాగుతారు వీళ్ళు?' మరొక తండ్రి ఆక్రోశంగా అన్నాడు.
'మనసుండాలి గానీ, మార్గమే దొరకదా?' ఇంకొకాయన అన్నాడు. ఆ మాటకు సుప్రజ ఉలిక్కిపడింది.
'పొద్దున్న అన్నయ్య కూడా ఇదేమాట అన్నాడు! అంటే? వాడు ముందే, ఒక స్థలాన్ని ఎంచుకున్నాడా?'
'అనిమేశ్‌కి అలాంటి అలవాటు లేదు. మీ అబ్బాయిలకీ లేదు. మనకు తెలుసు!' సారథి గొంతు బలహీనంగా ధ్వనించింది.
'మనకి ఉందిగా! అది చాలదా? శ్రీకారం చుట్టటానికి ఈ ముహూర్తం దొరికిందన్నమాట వీళ్ళకి!' ఆత్మ విమర్శ, పరనింద కలిసికట్టుగా ధ్వనించాయి మరొకాయన స్వరంలో.
సుప్రజకి మళ్లా అనిమేశ్ మాటలు గుర్తుకొచ్చాయి.
'ఇవాళ నా బర్త్ డే గ్రాండ్‌గా జరగబోతోంది!'
'ఇదా ఆ మాటల అర్థం! అదీ కరోనా కట్టడిలో.. వీళ్ళకీ?! ఊరంతా నిశ్శబ్దంగా ఉంటే, గుట్టు చప్పుడు కాకుండా, ఇలాంటి వ్యసనానికి బీజం వేసుకున్నారా?' మొదటిసారిగా ఆమెకి అన్నయ్య మీద అసహ్యం కలిగింది.
మరో పావుగంట తమని తాము నిందించుకుని, ఏ సాయంత్రానికో, కొడుకులు తిరిగి రాకపోరనే అభిప్రాయానికి వచ్చి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని, అంతా లేచి వెళ్ళిపోయారు.
సారథి, సత్యవతి మొహాల్లో నెత్తురు బొట్టు లేదు.
ఆ పూట ఆ ముగ్గురికీ తిండి లేదు. తలొక గదిలోనూ కూర్చుండిపోయారు.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మోగిన కాలింగ్ బెల్ ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఉరుములా ధ్వనించింది.
అంతకుముందు, గంట క్రితం సుప్రజకి అనిమేశ్ ఫోన్ చేసి 'అమ్మా, నాన్నా కంగారు పడుతున్నారా?' అని అడిగాడు.
'లేదు, మండి పడుతున్నారు!' విసురుగా జవాబిచ్చి, 'ఎక్కడున్నావ్ నువ్వసలు?' కోపంగా అడిగింది సుప్రజ.
'వచ్చేస్తున్నా! ఒక గంటలో ఇంట్లో ఉంటా. అమ్మానాన్నతో చెప్పు!' అని ఫోన్ పెట్టేశాడతను.
హాల్లోనే సోఫాల్లో కూర్చుని ఎదురుచూస్తున్న సారథి, సత్యవతి కాలింగ్‌బెల్ వినీ కదల్లేదు. కోపంతో బిగుసుకుపోయారు. సుప్రజ లేచి వెళ్ళి తలుపు తీసింది.
ఉత్సాహంగా లోపలికి వచ్చాడు అనిమేశ్. అతడి మొహంలో అలసటతో పాటు, ఏదో సాధించిన సంతృప్తి.
అపరాధ భావంతో, బెరుకు చూపులతో ప్రవేశిస్తాడనుకున్న కొడుకు అంత ఉత్సాహంగా రావటం అర్థం కాలేదు సారథికి.
'ఏమైపోయావు పొద్దుట్నించీ?' ఏడుస్తూ కొడుకు మీదకు వెళ్ళింది సత్యవతి.
'మీకు కోపం తెప్పిస్తానని తెలిసినా, ముందుగా చెప్తే అస్సలు ఒప్పుకోరనే, ఇలా చేశానమ్మా! అయాం సారీ!! కానీ, నా పుట్టినరోజున ఒక మంచిపని చేశాను. గత మూడు వారాలుగా మన కాంపౌండ్‌కి కూరల తెస్తున్న సుబ్రమణ్యంతో మొన్న మాట్లాడినప్పుడు తెలిసింది, అతడి పొలంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ విరగ కాసాయిగానీ, ఆ కాపు కోసేవారు లేక, ఒక్కడి వల్లా కాక, పాడై పోతున్నాయని. కరోనా కట్టడి, కట్టడిని మించిన భయం. వీటి మూలంగా ప్రభుత్వం అనుమతించినా, పంట కోయటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి! అది చెప్తూ అతడు కార్చిన కన్నీళ్ళు నన్ను కదిలించాయి నాన్నా! అప్పుడే అనుకున్నాను, వెంటనే నా మిత్రులతో వెళ్ళి, ఒక్కరోజు కష్టపడి, అతడికి సాయం చేస్తున్న పేరుతో, మనందరికీ ఆహారమైన ఆ పంటని కాపాడుకుందామని. నిన్ననే, నా మిత్రులను సంప్రదించాను. కర్ఫ్యూ పాసులు అవసరమవుతాయని తెలిసింది. ఆన్‌లైన్‌లోనే ఏర్పాటు చేసుకున్నాము.
ఆరుగురు మిత్రులం ఈ ఉదయమే బయల్దేరి, ఇక్కడికి పదిమైళ్ళ దూరంలో ఉన్న అతడి పొలానికి వెళ్ళాం. రోజంతా శ్రమించి, ఆ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొత్తం కోయగలిగాం. మూటలూ కట్టి పెట్టాం. మీరనుమతిస్తే, రేపు ఉదయం వెళ్ళి, ఆ మూటలని కార్లలో వేసుకొచ్చి, ఈ చుట్టుపక్కల కాలనీలలో అమ్మేస్తాం - సరుకు చెడకుండా, ఆ బడుగు రైతుకి నష్టం రాకుండా.
ఈ కరోనా సమస్యలో ఇలాంటి ఎందరో ఉన్నారు. అందరికీ చేయలేను, కనీసం, పైకి అతడి ఉదరం నింపుకోవటమే కనిపిస్తున్నా, కరోనా ప్రమాదానికి ఎదురీదుతూ, నిజానికి మనందరి కడుపులూ నింపుతూ, మనకు కూరలు తెస్తున్న మన రైతు కోసమైనా, ఉడుతా సాయం చేయాలనిపించింది నాన్నా! అందుకు నా పుట్టినరోజూ కలిసొచ్చింది! ఈ నా పుట్టినరోజున ఆ పొలంలో శ్రమిస్తూ, గడిపానమ్మా!'
కొడుకు మాటలకి సారథి కదిలిపోయాడు. కొడుకుని సక్రమంగా అంచనా కట్టలేకపోయిన అపరాధ భావం అతడిని ఆవహించింది. పద్దెనిమిదే నిండిన కొడుకు అతడి కళ్లకి ఎంతో ఎదిగిపోయినట్లు కనిపించాడు.
'ఇటువంటి ఆదర్శవంతమైన యువత గురించి, మధ్యాహ్నం తామెంత నీచంగా ఆలోచించారు! బాధ్యతాయుతులైన కన్నవారిగా విర్రవీగే తాము వారినెంత సక్రమంగా అంచనా వేయగలిగారు?'
'మీరే చెప్పండి నాన్నా, నేను ముందుగా నా నిర్ణయం చెప్తే, మీరు అంగీకరించేవారా? నన్ను అనుమతించేవారా?'
ఆ సూటి ప్రశ్నకి జవాబు చెప్పలేక, కొడుకుని దగ్గరకు తీసుకుని, హృదయానికి హత్తుకున్నాడు సారథి.
కొడుకు దగ్గరకు తీసుకుని ఏడుస్తూనే అతని నుదుటిపై ముద్దు పెడ్తూ 'నా బంగారం! నీది ఎంత మంచి మనసురా!' అంది తల్లి.
పి.వి.ఆర్. శివకుమార్
9594996990