Jun 23,2023 23:51

ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి-తెనాలి : విద్యార్థుల వద్ద పాఠ్యపుస్తకాలు లేకుంటే దానికి ఉపాధ్యాయులే బాధ్యులని పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ హెచ్చరించారు. స్థానిక రావి రవీంద్రనాథ్‌ నగర్‌లోని ఎపిటిడబ్ల్యూఆర్‌ బాలికల పాఠశాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పుస్తకాలు, డిక్షనరీ లేనివారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించగా కొందరు విద్యార్థులు తమవద్ద డిక్షనరీ లేదని చెప్పారు. గతేడాది కూడా కొందరికి డిక్షనరీ ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఆయన డిక్షనరీ లేనివారిని, డిక్షనరీ ఉన్నవారిని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. దీనిపై మండల విద్యాధికారి ఎం.లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.విజరుకుమార్‌ను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరూ సరిగా పని చేయటం లేదని, విద్యార్థులతో సమీక్షించడం లేదని ఆగ్రహించారు. తనకు ఎవ్వరిమీదా కోపం లేదని, విద్యార్థుల భవిష్యత్‌ కోసమే కఠినంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. విద్యార్థులతో వాట్సప్‌ ద్వారా మళ్లీ మాట్లాడతామని, పరిస్థితిలో మార్పు రాకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు మెటీరియల్‌ అందుబాటులో ఉంచే బాధ్యత ఎంఇఒ, డిఈవోది కూడా అని స్పష్టం చేశారు. పుస్తకాలను ఇంటి వద్ద ఉంచకూడదని, పాఠశాల్లో తమతోపాటే పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు.