అనంతపురం కలెక్టరేట్ : ప్రపంచాన్ని తెలియజేసి, విజ్ఞానాన్ని అందించే మంచి నేస్తం పుస్తకం అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో బాలల దినోత్సవంతో పాటు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో'.. అని కందుకూరు వీరేశలింగం పంతులు అన్న మాటలు అక్షర సత్యాలన్నారు. మంచి పుస్తకాలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ చదువుకునేందుకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు చెప్పారు. సెలఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రంథాలయం అభివద్ధికి గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఉమాదేవి చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఉమాదేవి, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.