
''పుస్తకాలు మనో మాలిన్యాలను తొలగించే దీపాలు'' అని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. నిజమే కదా. మానవుడు ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగంలో అడుగుపెట్టి జీవిస్తున్న ప్రస్తుత నవీన జీవితానికి వారధులుగా పుస్తకాలు నిలిచాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. పుస్తక పఠనం ద్వారానే మానవుడు తనను తాను తెలుసుకుంటూ, గత సమాజ నిర్మాణాన్ని నాగరికత అభివృద్ధి అవపోసన పట్టి... నేటి ఆధునిక యుగంలో మెరుగైన స్థితిలో ఉండేందుకు బాటలు పరచుకున్నాడు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా జీవితాన్ని కొనసాగించుటకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ఒక సమూహం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే పుస్తక పఠనం చేయాలి. కొత్త ఆలోచనలతో నూతన పుస్తకాలు రచించాలి, ప్రచురించాలి, అవసరమైన సందర్భాల్లో కాపీరైటు పొందాలి. చదవటం ద్వారానే మనిషి మేధస్సు పరిఢవిల్లి అనేక అద్భుతాలు, ఆవిష్కరణలు చేయగలుగుతారని చరిత్ర చెబుతోంది. రవాణా సౌకర్యాలు, విద్యా, వైద్యం, ఇంజనీరింగ్, పరిపాలన, సాంకేతిక పరిజ్ఞానం మానవుడు డిజిటల్ యుగంలో నివసించే స్థాయిలో ఉంచింది. సంకుచిత భావాలు వీడి, కుల మత ప్రాంతీయ భాషా లింగ భేదాలు విడనాడి, రాజ్యాంగం ఆశించిన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా ప్రజలు ఉండాలి. అభ్యుదయ, ప్రగతిశీల భావాలను పంచి నవభారత్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. రాజ్యాంగ ఆశయాలు సాధించాలి. అందుకోసం అందరూ పుస్తకాలు అధ్యయనం చేయాలి.
ప్రఖ్యాత రచయిత ''బెకన్'' చెప్పినట్లు కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, కొన్ని మింగేయాలి, కొన్ని నమిలి జీర్ణించుకోవాలి. థామస్ పెయిన్ రాసిన ''రైట్స్ ఆఫ్ మేన్'' పుస్తకం చదివి నమిలి జీర్ణించుకోవడం ద్వారానే జ్యోతి రావు ఫూలే మన దేశంలో ఉన్న కుల, మత, లింగ అసమానతలు పారదోలడానికి ఉక్కు పిడికిలి బిగించాడు. గురజాడ అప్పారావు రాసిన ''కన్యాశుల్కం'' ఆ రోజుల్లో బాల్యవివాహాలు అరికట్టడానికి ఉపకరించింది. ''ది రూట్స్'' పుస్తకం నల్లజాతీయుల చీకటి జీవితాలను ప్రపంచానికి చాటి చెప్పింది. పుస్తక పఠనం ద్వారా అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి ఎందరో మేధావులు సమాజంలో ఉన్న అనేక అసమానతలపై పోరుబాట పట్టి, ప్రపంచంలో మానవులు అంతా సమానమే అనే భావన కల్పించారు. శ్రమ దోపిడిపై ''కారల్ మార్క్స్ రచనలు'' అనేక పెట్టుబడిదారీ, నియంతృత్వ దేశాలకు కునుకు లేకుండా చేశాయనడంలో ఆశ్చర్యం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 19, 20 శతాబ్దంలోనే గురజాడ, వీరేశలింగం, గిడుగు, జూషువా, శ్రీశ్రీ, చలం, దాశరథి, ఆరుద్ర , సి.నా.రె, కారా మాస్టారు...వంటి వారి రచనలు తెలుగు ప్రజలను చైతన్య పరిచాయి. ప్రస్తుత తిరోగమన ఆలోచనలకు బీజం వేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే రచయితలు, పుస్తకాలు రావలసిన అవసరం ఉంది. సృజనాత్మకతకు పెద్ద పీట వేయాలి.
అందుకే కందుకూరి వీరేశలింగం పంతులు ''చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో'' అని ఆనాడే చెప్పారు. పుస్తక పఠనం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నూతన ఆలోచనలు కలుగుతాయి. నూతన ఆవిష్కరణలు మార్గం సుగమం అవుతుంది. ఊబకాయం తగ్గుతుంది. శాస్త్రీయ దృక్పథం కలిగి...మూఢ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాలను పారదోలడానికి పఠనం సహాయపడుతుంది. ''మనం చదివే పుస్తకం మనలోని అజ్ఞానాన్ని ఒక మొట్టికాయ వేసి, మేల్కొలిపే విధంగా ఉండాలని... గడ్డకట్టిన సముద్రాన్ని గొడ్డలితో పగలగొట్టే విధంగా ఉండాలని'' ప్రముఖ రచయిత'' కాఫ్కా'' అంటారు.
ప్రస్తుతం గుడులు గోపురాలు, ఆశ్రమాలు, విగ్రహాలు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. కానీ విజ్ఞానాన్ని పెంచే గ్రంథాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చేవారు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. మన రాష్ట్రంలో కూడా ప్రతీ పాఠశాలకు, కళాశాలలో గ్రంథాలయాలు, పుస్తకాలు ఏర్పాటు చేయాలి. నిధులు మంజూరు చేయాలి. లౌకిక విధానానికి అనుగుణంగా ప్రభూత్వాలు సిలబస్ రూపొందించి పుస్తకాలు ప్రచురించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలు మెరుగు పరచే అంశాలు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. డిజిటల్ రూపంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ''ఈ-బుక్స్'' పాత్ర కీలకం అవుతున్నది. అయితే ఇంటర్నెట్ మొబైల్ సేవలు అందరికీ అందుబాటులో ఉంచాలి. పూర్వ కాలం నుంచి నేటి వరకూ మానవుని పురోభివృద్ధికి పునాదులు పుస్తకాలు మాత్రమే. ''పుస్తకం హస్తభూషణం'' అనే నానుడి నిజం చేయాలి.
మానవ మనుగడకు రక్తప్రసరణ ఎంత అవసరమో, పురోభివృద్ధికి నేస్తాలు పుస్తకాలే అని అందరూ గ్రహించటమే ఈ ప్రపంచ పుస్తక దినోత్సవ పరమార్థం.
- ఐ. ప్రసాదరావు
సెల్ : 9948272919.