Jul 24,2023 17:57

తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ : ప్రభుత్వ కళాశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. తొలుత విద్యార్థులు అచ్చంపేట రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుండి ప్రదర్శనగా తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కె.సాయికుమార్‌ మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ గురుకుల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందచేయాలని కోరారు. గతేడాది సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వని కారణంగా 36 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేశారు. కళాశాల ప్రారంభమై నెల కావస్తున్నా ఇంతవరకు పుస్తకాలు ఎందుకు ఇవ్వటంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో 470 ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉంటే కేవలం 200 కళాశాలకే ప్రిన్సిపాల్స్‌ ఉన్నారని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో క్రీడా మైదానం ఉన్నా పీడీ లేరని, తక్షణం పీడీని నియమించాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ సత్తెనపల్లి డివిజన్‌ కార్యదర్శి డి.అమూల్య, నాయకులు జి.గోవిందు, ఇట్లాస్‌, సాంబశివరావు, విద్యార్థులు పాల్గొన్నారు.