ఉచిత పుస్తకాల పంపిణీ ప్రారంభం
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : పుస్తకాలు చదవడం వలన విజ్ఞానంతో పాటు సామాజిక అంశాలపై కూడా పట్టు పెరుగుతుందని సిద్దార్ద అకాడమి అధ్యక్షులు డాక్టర్ సి.నాగేశ్వరరావు అన్నారు. పుస్తక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ వద్దగల సర్వోత్తమ భవన్ నందు ఉచిత పుస్తకాల పంపిణీని శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విజ్ఞానంతో పాటు వికాసం, సామాజిక అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. నేడు పుస్తకాలకు ఆదరణ పెరుగుతుందని, విజయవాడ నగరంలో ఉచితంగా పుస్తకాల పంపిణీ చేయడం మంచి పరిణామమని విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రదాన కార్యదర్శి డాక్టర్ రావి శారద మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈపుస్తక ప్రదర్శన ద్వారా రెండు లక్షలకుపైగా ఉచితంగా పుస్తకాలను అందించినట్లు తెలిపారు. దాతలు తమకు ఇచ్చిన ఈపుస్తకాలను అందరికీ అందించడం పుస్తక దాత, పుస్తక స్వీకర్తకు కూడా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇందులో సాదారణ గ్రంథాలతో పాటు తత్వశాస్త్రం, మతాలు, ఆధ్యాత్మిక, సాంఘిక, భాష, ఇంజనీరింగ్, వైద్య, విజ్ఞాన శాస్త్రాలు, కళలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య గ్రంథాలు,చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఎన్నో ఉన్నాయన్నారు. పదవ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన వివిధ విద్యా సంస్థల స్టడీ మెటీరియల్స్‌తో కలిపి దాదాపు 50 వేలకుపైగా పుస్తకాలు ఉన్నాయని, రెండు రోజుల పాటు జరిగే ఈప్రదర్శనలో ప్రతి ఒక్కరూ రెండు పుస్తకాలను ఉచితంగా తీసుకువెళ్లవచ్చని తెలిపారు.










