Apr 23,2023 23:23

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌, సామర్లకోట రూరల్‌ ప్రపంచ జ్ఞానాన్ని పెంచే పుస్తక పఠనాన్ని బాల్య దశ నుంచి పిల్లల్లో అలవరచాలని గ్రంథాలయ విశ్రాంతి ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌లో బోట్‌ క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదివే అలవాటును ప్రోత్సహించడానికి పుస్తకాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ఏటా ఏప్రిల్‌ 3న ప్రపంచ పుస్తక దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. చదివే అలవాటు జీవితంలో ఉత్తమమైన అలవాటని, మంచి పుస్తకాన్ని చదవడం ద్వారా ఇంట్లో సమయాన్ని గడపడంతోపాటు అనేక విషయాలపై జ్ఞానాన్ని పొందవచ్చని సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్‌, కె.శ్రీరామరాజు, పార్థసారథి, ఎస్‌.శ్రీనగేష్‌, రేలంగి బాపిరాజు, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలు విజ్ఞాన ద్వారాలు అని అవి చీకటిలో దారి దీపాలు అని బాలమందిరం కన్వీనర్‌ అంగర గోపాలకృష్ణ (కృష్ణశ్రీ) అన్నారు. సామర్లకోట మండలం మాధవపట్నం జమునా నగర్‌లో అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్‌ ఆధ్వర్యంలో పుస్తక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తక పఠనం గురించి వివరించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు పుస్తక పఠనం చేశారు. పుస్తక సమీక్ష చేసారు. ఎంపిక చేసిన విందుభోజనం కథను నాటకీకరణ గావించి చక్కగా ప్రదర్శించారు.వక్తత్వపోటీలో గెలుపొందిన విద్యార్థులకు బాల మందిరం కన్వీనరు కృష్ణశ్రీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల మందిరం విద్యార్ధులు పాల్గొన్నారు.