ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవ్‌లో రోజురోజుకూ సందర్శకులు, పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రదర్శన ఏర్పాటు చేయడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పెద్ద స్థాయిలో కళాశాలలు, విద్యా సంస్థలు ఉండటంతో సాయంత్రం సమయంలో పుస్తక మహౌత్సవం ప్రాంగణం విద్యార్థులతో కళకళలాడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాల కోసం ఆయా పుస్తక స్టాల్స్‌ను సంప్రదించడంతో పాటు ఎటువంటి పుస్తకాలు కావాలో ఆయా పబ్లిషర్స్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా రానున్న రెండు మూడు నెలల్లో వివిధ ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు జరుగనున్నాయి. దీనితో పోటీ పరీక్షలకు ంసబంధించిన పుస్తకాలు, అలాగే వివిధ ప్రవేశ పరీక్షలకు ఎలా సిద్దమవ్వాలో పేరొందిన పబ్లిషర్స్ ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందించాయి. వాటిని విద్యార్థులు ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. అలాగే విద్యాసంస్థల ఉపాధ్యాయులు, మహిళలు పుస్తక మహోత్సవ్‌కు రావడంతో సందడిగా కనిపిస్తుంది. పుస్తక మహోత్సవ్‌లోని ప్రతిభా వేదికపై గురువారం క్విజ్ ఫోటీలను నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్ధినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవ్‌లోని గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై బెల్లంకొండ రామదాసు శత జయంతి సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా సీనియర్ జర్నలిస్టు రెంటాల జయదేవ్ పాల్గోనున్నారు. సభా కార్యక్రమానికి ప్రముఖ కవి వెన్నా వల్లభరావు అధ్యక్షత వహించనున్నారు. ప్రతిభా వేదికపై సాయంత్రం 7 గంటలకు పప్పెట్ షో, సైన్స్ ప్రయోగాలు ఉంటాయి.










