Oct 20,2023 22:41

పుష్పపల్లకిపై గోవర్థనుడుగా మలయప్ప


పుష్పపల్లకిపై గోవర్థనుడుగా మలయప్ప

ప్రజాశక్తి -తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గోవర్ధనగిరిధారి అయిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకష్ణుని అలంకారంలో మలయప్ప స్వామి పుష్పక విమానంలో దర్శనమిచ్చారు. పుష్పక విమానం సేవను మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్స వాలలో నిర్వహిస్తారు. వాహన సేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. ఈ ప్రత్యేకమైన పుష్పక విమానాన్ని కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 27 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దాదాపు ఒక టన్ను బరువు ఉంటుంది. ఇందులో 6 రకాల సంప్రదాయ పుష్పాలు ఉపయో గించారు. శ్రీవారి పుష్పక విమానాన్ని మూడు దశలలో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, మొదటి దశలో అష్టలక్ష్ములు, రెండవ దశలో ప్రభావళితో కూడిన అష్టనాగులు, మూడవ దశలో తిరునా మాలు, గోపురంతో రూపొందిం చారు. తమిళనాడు లోని సేలానికి చెందిన 20 మంది, టీటీడీ గార్డెన్‌ విభాగానికి చెందిన 10 మంది వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన విమానాన్ని సిద్ధం చేశారని టీటీడీ గార్డెన్‌ విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత రాంప్రసాద్‌ భట్‌ శ్రీవారి పుష్పక విమానాన్ని ఆకర్షణీ యంగా రూపొందిం చేందుకు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ , ఈవో, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు పాల్గొన్నారు.