Oct 29,2023 21:49

బత్తలపల్లిలో పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి-బత్తలపల్లి : అందరి కళ్లలో చెప్పలేని ఆనందం, చిన్ననాటి మిత్రులను కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేవు. అందరూ తమ కుటుంబ సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులు, తారతమ్యాలు అన్నీ మరిచిపోయారు. ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆత్మీయంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ చిన్ననాటి తమ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. బత్తలపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 1993-91లో పదవ తరగతి బ్యాచ్‌లో 180 మంది విద్యార్తులు చదువుకోగా, వారిలో 120 మంది ఆదివారం స్థానిక గుండా కళ్యాణమండపంలో ఆత్మీయ కలయిక నిర్వహించుకున్నారు. దసరా సెలవులకు సుదూర ప్రాంతాల నుంచి భర్త, పిల్లలతో స్వగ్రామాలకు వచ్చిన వీరందరూ ఆదివారం బత్తలపల్లిలో సమావేశమై చిన్ననాటి కబుర్లతో ఆనందోత్సహాల మధ్య రోజంతా గడిపారు. ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంతో ఆనందంగా గడిపారు. ప్రతీ ఏటా స్నేహితులందరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు షణ్ముఖరెడ్డి, నాగరత్నమ్మ, రామచంద్ర, అజరు, మల్లయ్య, కొండన్న, విశ్వరూప, పాఠశాల స్థలదాత జక్కంపూడి సత్యనారాయణలను ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ 'ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు మా శిష్యులేనని, మీరు ఉన్నత స్థానాలను అధిరోహించాలని మీ కన్న తల్లిదండ్రులతో సమానంగానే మేము ఆశించామని,ఈ రోజు వివిధ రంగాల్లో మీరు రాణిస్తుండడం మాకు గర్వంగా ఉంద'ని అన్నారు. ఇద్దరు మిత్రురాళ్లు తమ భర్తలను కోల్పోవడాన్ని తెసుకున్న వారు వారి కుటుంబాలకు రూ. 80 వేలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు లక్ష్మానాయుడు, రమేష్‌, జనార్దనాయుడు, చంద్రశేఖర్‌, శంకరయ్య, సురేంద్ర, సుబ్రమణ్యం, నారాయణస్వామి, కుమ్మర కలిసింహారెడ్డి, శంకరరెడ్డి, బోయపాడి సూర్యనారాయణ, కుమ్మర అదికారాయణ, బ్యాంకు కాశప్ప, రవి, కమతం సంగాలప్ప పెదయ్యతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
హిందూపురం : పట్టణంలోని ముదిరెడ్డిపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో 1989-90లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 34 సంవత్సరాల అనంతరం పాఠశాల ఆవరణంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ కలయికలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.