Aug 10,2023 22:53

ప్రజాశక్తి - భీమడోలు
             భీమడోలు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు కఠారి కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి (కోరు మాస్టారు) సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కోరు మాస్టారు స్మారక ప్రతిభా పురస్కారాలకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు పూర్వ విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. అధ్యక్షత వహించిన ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమడోలు పూర్వపు సమితితోపాటు, అనంతరం కొనసాగిన మండల వ్యవస్థలో ఉపాధ్యాయులుగా కొనసాగిన కోరు మాస్టారుగా గుర్తింపు పొందిన కఠారి కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి విద్యావ్యాప్తికి, విద్యార్థుల అభ్యున్నతికి చేసిన సేవలు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న వారి కుమారులు పుణ్యమూర్తి, సుబ్రమణ్యం అదే ఒరవడిని కొనసాగించే క్రమంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరై పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్న వి ద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు షీల్డ్‌లను అందించి వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా గత విద్యా సంవత్సరం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో పాఠశాల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానం దక్కించుకున్న విద్యార్థులు కె.రితికకు రూ.ఐదు వేలు, ఎల్‌.వినూత్నకు రూ.నాలుగు వేలు, వెజ్జు పవన్‌కు రూ.మూడు వేలు నగదు పురస్కారాలతో ప్రతిభా పురస్కార షీల్డులను అందించారన్నారు. దీనికి అదనంగా అప్పట్లో కోరు మాస్టారుతో పని చేసిన సమకాలీన ఉపాధ్యాయులు, ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్న సన్నిపల్లి వసంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్‌.శ్రీనివాసరావును సత్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కఠారి వీర వెంకట సత్యనారాయణ (బాబూరావు), ఎన్‌ఆర్‌ఐ, పాఠశాల పూర్వ విద్యార్థి పూజారి రాకేష్‌, పాఠశాల ఉపాధ్యాయులు అనీల్‌, అహమ్మద్‌ కోరు మాస్టారు స్మారక ప్రతిభా పురస్కార అవార్డు విజేతలను అభినందించారు.