
ప్రజాశక్తి-నక్కపల్లి:స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1998-99లో పాఠశాలలో చదువుకున్న పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన నక్కపల్లి పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో స్థిరపడిన వారంతా చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చిన్నతనంలో చేసిన అల్లరి, ఆడిన ఆటలు, గురువులు బోధించే తీరు అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. తమకు విద్య నేర్పిన ఆనాటి గురువులు శర్మ, వెంకట్రావు, నాగలక్ష్మి, శాంతి కుమారి, పివీఎస్ ఆచార్యులు, నాగేశ్వరావులను ఘనంగా సత్కరించారు. పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థులు కొప్పిశెట్టి బుజ్జి, నున్న సుధీర్, కొల్నాటి నానాజీ, గట్టెం సత్యనారాయణ, శ్రీదేవి, లీల దేవి, జ్యోతి, మణి,గంగిశెట్టి లోవరాజు పాల్గొన్నారు.