ప్రజాశక్తి-రాంబిల్లి
మండలంలోని లాలం కోడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 2003 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆత్మీయంగా కలిశారు. 122 మంది పూర్వ విద్యార్థులు లాలం కోడూరు హైస్కూల్లో కలుసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 20 ఏళ్ల తరువాత కలిసిన వీరంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన కాశిరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ తాను ఇక్కడి ఉపాధ్యాయుల సహకారంతో చదువుకొని ఎస్‌ఐగా ఉద్యోగాన్ని సాధించినట్లు చెప్పారు. లక్ష్మణరావు ఎస్‌ఐ కావడంపై తోటి మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆపదల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్న అందరమూ సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీనికి ఒక సంఘం పెట్టి దాని ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
అచ్చుతాపురం : మండలంలోని ఎం జగన్నాధపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2008-09 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మంగళవారం ఆత్మీయంగా కలుసుకున్నారు. వీరంతా ఒకరినొకరు ఆలింగం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. 'ఏరా ఏం చేస్తున్నావ్?' 'ఏమిటి విశేషాలు' అనే పదాలతో ఉచ్చరించుకున్నారు. పిల్లలు బాగున్నారా ఎంత చదువుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి బి.శ్రీను, గణేష్, ప్రగడ శీను, నాగ జగదీష్, రాజ నాయుడు, ఆనంద్, బి.రాజు, వెంకట అప్పారావు తదితరులు ఆర్గనైజర్లగా వ్యవహరించారు.










