ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో 'సురక్షిత పురుగుమందు వాడకం, సమగ్ర చీడపీడల యాజమాన్యం'పై శుక్రవారం శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో (హిల్ లిమిటెడ్ అండ్ కిసాన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అగ్రిటెక్ ప్రయివేట్ లిమిటెడ్) నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి హాజరయ్యారు. కృషి విజ్ఞాన కేంద్రంలోని వివిధ ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి, రైతులకు తమ సందేశాన్ని ఇచ్చారు. వివిధ ప్రయివేట్ కంపెనీల వారు (కోరమాండల్, బేయర్స్, సింజేంటా, హిల్, కోటెవా, అదామా, ఎన్‌ఎస్‌సి) తమ ఉత్పత్తులను రైతుల సందర్శనార్థం ప్రదర్శించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.సుజాతమ్మ, కృషి విజ్ఞాన కేంద్రం సస్య రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రమేష్ నాయక్ పురుగు మందుల పిచికారి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చీడపీడల బారీ నుంచి పంటను కాపాడుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెళకువల గురించి తెలిపారు. డాక్టర్ కెఎస్‌ఎస్ నాయక్, డాక్టర్ పి.అపర్ణ, డాక్టర్ వై.మౌనిక, డాక్టర్ చందన, డాక్టర్ నిరంజన్ రెడ్డి, ఎం.మహాదేవయ్య పాల్గొన్నారు.