Jun 10,2023 23:48

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ నెల 12 నుంచి పాఠశాలల పున ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యా కానుక కిట్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామని ఒక పక్క ప్రభుత్వం, మరోవైపు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అన్ని పుస్తకాలూ ఇంకా చేరుకోలేదు. విద్యా కానుకలో పలు వస్తువులు ఇంకా రాలేదు. కాకినాడ జిల్లాలో 1,283 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 76,920 మంది బాలురు, 82,877 మంది బాలికలు మొత్తంగా 1,59,797 మంది చదువుతున్నారు. జగనన్న విద్యా కానుక కిట్లో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బెల్ట్‌, ఒక జత షూస్‌, రెండు జతల సాక్స్‌, డిక్షనరీ, మూడు జతల యూనిఫామ్‌, బ్యాగు ఇస్తున్నారు. కుట్టించుకునేందుకు కుట్టికూలీ ఇస్తారు. వేసవి సెలవుల్లోనే ఈ కిట్లను పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. అందుకు తగ్గట్టు ఎస్‌ఎస్‌ఎ అధికారులు అన్ని పాఠశాలలకూ వీటిని అందివ్వాలి. కానీ ఆచరణలో పూర్తిస్థాయిలో సామాగ్రి చేరుకోలేదు.
పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఏవీ.?
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1.60 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ కలిపి 14,57,599 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 11,80,452 మాత్రమే పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇంకా 2,77,147 పుస్తకాలు రావాల్సి ఉంది. కోటనందూరు మండలంలో 32 పాఠశాల లుండగా 30,077 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 17,404 మాత్రమే అందాయి. ఇంకా 12,673 పుస్తకాలు చేరాల్సి ఉంది. కరపలో 65 పాఠశాలుండగా 57,983 పుస్తకాలకు గానూ 34,820 అందాయి. ఇంకా 23ర,163 పుస్తకాలు రావాలి. ఏలేశ్వరం మండలంలో 40 పాఠశాలకు 62,244 పుస్తకాలు రావాల్సి ఉండగా 37,385 అందాయి. ఇంకా 24,859 పుస్తకాలు రావాలి. ఇలా పలు మండలాల్లో పాఠశాలలకు పూర్తిస్థాయిలో పుస్తకాలు చేరుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో చేరుకోని పరిస్థితి నెలకొంది. పాఠశాలలు ప్రారంభం నాటికే అన్ని వస్తువులు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందజేస్తామని విద్యాశాఖ అధికారులు ఏటా చెబుతున్నా ఆచరణలో విఫలమవుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు చేరేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యా కానుక కిట్లలో వస్తువులన్నీ నాణ్యతతో అందివ్వాలని పలువురు తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు.