స్వమిత్వ జిల్లా శిక్షణా కేంద్ర సమన్వయకర్త నిఖిల్
ముగిసిన శిక్షణా తరగతులు
ప్రజాశక్తి - భీమడోలు
జిల్లాస్థాయిలో వైస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వమిత్వ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న గ్రామపంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయి అవగాహన కల్పించుకోవాలని స్వమిత్వ జిల్లా శిక్షణా కేంద్రం సమన్వయకర్త నిఖిల్ కోరారు. జిల్లాస్థాయి శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నాలుగవ బ్యాచ్‌కి చెందిన 70 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు స్వమిత్వ కార్యక్రమంపై క్షేత్రస్థాయి సందర్శన, అవగాహన కోసం జిల్లా స్థాయిలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన కోడూరుపాడును సందర్శించారు. వారికి స్వమిత్వ సర్వేపై గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా భీమడోలు మండల సర్వేయర్ ధర్మారావు, దుద్దేపూడి గ్రామ సచివాలయ డిజిటల్ సహాయకులు వెజ్జు ధర్మ వారికి అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు లేవనెత్తిన యాజమాన్య ధ్రువీకరణ, ఆక్రమణల క్రమబద్ధీకరణ, ఆస్తుల రిజిస్ట్రేషన్, ఇతర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దుద్దేపూడి, కోడూరుపాడు గ్రామపంచాయతీల సర్పంచులు ఎన్.శ్రీనివాసరావు, ఎం.నాగేశ్వరరావుతో పాటు గ్రామపంచాయతీ విస్తరణ అధికారి ఎ.సుందరి పాల్గొన్నారు.










