Apr 24,2023 21:29

ప్రజాశక్తి - కుక్కునూరు
           పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిపరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని చట్టాలు చెబుతున్నప్పటికీ చట్టాలను తుంగలోతొక్కి, నిర్వాసితులను ముంచి ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు పూర్తిచేయడం ఎంతవరకు సమంజసమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. సిపిఎం, సిపిఐ చేపట్టిన రాజకీయ ప్రచారభేరి యాత్ర ముగింపు సభను సోమవారం కుక్కునూరులో నిర్వహించారు. సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు యర్రంశెట్టి నాగేంద్రరావు, మైసాక్షి వెంకటాచారీ అధ్యక్షతన ఈ సభ జరిగింది. రెండోరోజు యాత్ర చీరవల్లిలో ప్రారంభమై 12 గ్రామాల మీదుగా కుక్కునూరులో ముగిసింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ పోలవరానికి నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా బడ్జెట్‌లో నిధులను కేటాయించకుండా, పోలవరం ప్రాజెక్టు కాంటూర్‌పై కేంద్ర మంత్రులు రోజుకోమాట, పూటకో ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రజలను, ప్రాజెక్టు నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో సిఎం ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఇచ్చిన భూముల రైతులకు ఎకరాకు రూ.ఐదు లక్షలు, ప్రతీ నిర్వాసితుని కుటుంబానికి రూ.పది లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గోదావరి వరదలకు ఊళ్లకు ఊళ్లు మునిగి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై తలదాచుకున్న వరద బాధితులకు నేటికీ ఇంటి నష్ట పరిహారం చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. వరదలకు ఇల్లు కోల్పోయిన బాధితులు ఇప్పటికీ పునరావాస కాలనీల్లోనే ఉన్నారని మరో మూడు నెలల్లో వచ్చే గోదావరి వరదలకు వారి పరిస్థితి ఏమిటని, అప్పటికైనా పూర్తిపరిహారం ఇస్తారా మళ్లీ గోదావరి వరదల్లో ముంచుతారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు కేటాయించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ముంపుపై స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో నిర్వాసితులను ఏకం చేసి పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపిందన్నారు. ఎల్‌ఐసి, ఆర్‌టిసి, విశాఖ ఉక్కును ప్రయివేటుపరం చేసి అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతుందన్నారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టి తమకు అడ్డురాకుండా చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్‌డి.మునీర్‌, జిల్లా నాయకులు ఎస్‌.సాయిబాబా, కె.లక్ష్మయ్య, ఎపి గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కారం దారయ్య, పిట్టా ప్రసాద్‌, సిపిఎం నాయకులు వై.సాయికిరణ్‌, కోటా రామలక్ష్మి, ఎస్‌.లక్ష్మణరావు, రమేష్‌, వలీ పాషా, సిపిఐ మండల నాయకులు బాబూరావు, వి.నాగేశ్వరరావు, నరసింహారావు, పాల్గొన్నారు.
కొయ్యలగూడెం:ప్రజా ప్రయోజనాలను విస్మరించి పాలన సాగిస్తున్న ప్రధాని మోడీ విధానాలను ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ, సిపిఎం దేశవ్యాప్త ప్రచార భేరి యాత్రలో భాగంగా సోమవారం పట్టణంలోని ప్రధానకూడలి వద్ద ప్రచార భేరి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్య రావణకాష్టంగా ఉందని, నేటికీ పరిహారం చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వాసితుల పరిహారాన్ని ఎగనామం పెట్టే కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్లు బిగించడం రైతు మెడలకు ఉరితాళ్ళు బిగించడమేనని, ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా సెక్రటేరియట్‌ సభ్యురాలు నాగమణి మాట్లాడుతూ ప్రధాని మోడీ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నా సిఎం జగన్‌ తన కేసులకు భయపడి మోడీ పాదాల వద్ద సాగిల పడుతున్నారని విమర్శించారు. సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలను, హక్కులను కాలరాస్తూ గతంలో ఉన్న చట్టాలను సవరణ పేరుతో రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచార భేరిలో సిపిఐ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, ఆకుల దుర్గారావు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.బాజీ, దుగ్గిరాల నారాయణరావు, లక్ష్మి పాల్గొన్నారు.