ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్నెస్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాల భవన నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అత్యధిక మంది కాంట్రాక్టర్లు ఎక్కడి కక్కడ పనులు ఆపేశారు. మొత్తం 1200 భవనాలకుగాను ఇంతవరకు 237 భవనాలు పూర్తయ్యాయి. ఇందుకు ప్రభుత్వ నిర్వాకమే కారణం కావడంతో భవన నిర్మాణ గడువును తరుచూ పొడిగిస్తున్నది. అయినప్పటికీ ఇప్పట్లో పూర్తయ్యే కనిపించడంలేదు.
ప్రస్తుత కాకినాడ జిల్లా పరిధిలో ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ గ్రంథాలయాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు మూడేళ్ల క్రితం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.140.69 కోట్లతో 446, గ్రామ సచివాలయాలకు రూ.90 కోట్లతో 338 రైతు భరోసా కేంద్రాలకు, రూ.60.68 కోట్లతో 350 వైయస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. ఇప్పటివరకు గ్రామ సచివాలయ నిర్మాణాలు 141 పూర్తి కాగా అందులో 70 సచివాలయాలను అధి కారులకు అందజేశారు. మిగిలిన 71 సచివాలయాలు రాజకీయ నాయకుల నిర్ణయంతో క్షేత్రస్థాయిలో జరగని పరిస్థితి నెలకొంది. మిగిలిన 300 సచివాలయాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. వీటితోపాటుగా రైతు భరోసా కేంద్రాలు 59 పూర్తి కాగా, 30 రైతు భరోసా కేంద్రాలను అధికారులకు అందించగా మిగిలినవి ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తుండగా మిగిలిన 260 రైతు భరోసా కేంద్రాలు వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయి. ఎఎస్‌ఆర్ హెల్త్ సెంటర్లు కూడా 37 పూర్తికాగా, హెల్త్ సెంటర్లను ప్రారంభించి మిగిలినవి అలానే వదిలి వేశారు. సుమారు 2009 పైగా హెల్త్ సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి భవన నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవంగా ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలి. కానీ చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పనులు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అయితే మొన్నటివరకు బిల్లుల్ను చెల్లించలేదన్నపంతో పనులు ఆపివేసిన జనవరి నుంచి యధావిధిగా బిల్లులు చెల్లిస్తున్నారు.
ఇంతవరకు సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్నెస్ సెంటర్లకు సంబంధించి 237 భవనాలు పూర్తయ్యాయి. మరో 450 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాలకు చాలాచోట్ల పునాదులే తీయలేదు. పూర్తి చేసిన భవనాలకు సంబంధించి సుమారు రూ.112 కోట్ల మేరకు బిల్లులు చెల్లించినట్లు తెలిసింది. మరోవైపు భవన నిర్మాణ సామగ్రి ధరలు.పెరగడం, పనులు పూర్తిచేస్తే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో, లేదో సందేహంతో పలువురు కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను కొనసాగించ ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కొద్ది సాధారణ ఎన్నికలు జరగనుండంతో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను సెప్టెంబరు నెలాఖరునాటికి పూర్తి చేయించాలని ప్రభుత్వం తాజాగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆయా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజినీర్లకు ఉత్తర జారీ చేశారు. వీరు కాంట్రాక్టర్లతో మాట్లాడి మధ్యలో నిలిపేసిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ పనుల్లొ మాత్రం పురోగతి కనిపించడంలేదు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే పనులను పున్ణప్రారంభించేది లేదని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు.










