Nov 22,2021 12:18

నిన్నకి నేడు
ఇవాళ్టికి రేపు
కాలం పొడవునా
ఏదో దొరుకుతుందన్న
నమ్మకం ఇచ్చే
ఉత్సాహంతో
నడక

ఎదురుచూపులు
లేదులో కాదులో
విరిగిపడినప్పుడు
ఇది కాకపోయినా
ఇంకొకటి అవుతుందని
ప్రశ్నా జవాబూ
తనే అయ్యి
పరుగు

కావలసిందీ
దొరికిందీ దొరకందీ
తెలిసీ తెలియని
ప్రయాణం

ఎగబాక లేనందుకు
నలుపైనా
దిగజారనందుకు
తెలుపైనా
ప్రారంభాన్నీ
ముగింపునీ
తెలిపే
కన్నీటిచుక్క సాక్షిగా
సాధించాలని
అనుకోవటంలోనే
అంతా అయిపోయింది
పూర్తికాకుండానే
ముగిసిపోయింది

కళ్ళేపల్లి తిరుమలరావు
91770 74280