Apr 07,2023 23:45

మాట్లాడుతున్న సురేంద్ర


ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల పోలీసు స్టేషన్‌ పరిధిలో 2007లో వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్‌ పోలీసులు గిరిజన మహిళలపై లైంగిక దాడి ఘటనలో నిందితులకు శిక్షపడకపోవడం విషాద ఘటనగా మిగిలి పోతుందని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేంద్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థత, పోలీసు ఉన్నతాధికారులు నేరస్తులకు కొమ్ము కాయడమే దీనికి కారణమని ఆయన విమర్శించారు. కోర్టు తీర్పుననుసరించి తక్షణ దర్యాప్తు జరపని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాలం జరిగిన విచారణ అనంతరం కోర్టు తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. దీన్ని గుణపాఠంగా తీసుకొని వేరే కేసుల్లో బాధితులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసులే నిందితులుగా ఉన్న ఘటనలో పోలీసులనే దర్యాప్తు అధికారులుగా నియమించడం సమంజసం కాదన్నారు. అత్యాచారం చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆనాడు ఐక్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన మహిళలు ఆందోళనలు చేసినప్పటికీ, దర్యాప్తు తీరు పట్ల పలు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని వెల్లడించారు. సిబి సిఐడి పోలీసులు సరిగ్గా దర్యాప్తు జరపలేదని, నేడు కోర్టు కూడా అదే విషయాన్ని తీర్పులో తెలియజేయడం గమనార్హమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దర్యాప్తు సక్రమంగా జరపని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన గ్రేహౌండ్స్‌ పోలీసులను శిక్షించాలని, బాధిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులు, గిరిజనుల పట్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని సురేంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు పాల్గొన్నారు.