ప్రజాశక్తి-కొమరాడ : దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు - లాబేసు వంతెన పూర్తికి యుద్ధానికి సిద్ధం కావాలని వంతెన సాధన కమిటీ సభ్యులు వి.ఇందిర, కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం నాగావళి అవతల గ్రామాలైన కొట్టు, తొడుము, రాయపురం, తులసవలస, కెమిశీల, దిగువ గుణద, తదితర గ్రామాల్లో వంతెన సాధన కమిటీ, ఎపి రైతుసంఘం, వ్యకాస ఆధ్వర్యాన ప్రచారం చేశారు. గురువారం నుంచి చేపట్టే రిలే నిరాహార దీక్షలను మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఇందిర, సాంబమూర్తి మాట్లాడుతూ వంతెన పనులు ప్రారంభించి పాలకుల నిర్లక్ష్యంతో 14 ఏళ్లుగా సాగదీస్తున్నారని విమర్శించారు. కొమరాడ మండలంలో 31 పంచాయతీలకు గాను తొమ్మిది పంచాయతీల గిరిజనులు మండల కేంద్రానికి రావాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తంచేశారు. 1996లో వనిజ గ్రామం వద్ద నాగావళి నదిలో నాటు పడవ ప్రమాదంలో 36 మంది గిరిజనులు మృతిచెందారని గుర్తుచేశారు. ఇలాంటి సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రూ.14 కోట్లు విడుదల చేసి, కాంట్రాక్టరును రప్పించి, వంతెన పెండింగ్ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం గురువారం నుంచి ఈ నెల 26 వరకు మండలంలోని కోమట్లపేట గ్రామం వద్ద రిలే నిరాహార దీక్షలు, 28న తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం నాయకులు ఉపేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివున్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.










