Oct 19,2022 23:45

నిరసన తెలుపుతున్న వ్యాపారులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : పోలీసులు, అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం వల్ల పూర్తిగా నష్టపోతున్నామని పూర్ణా మార్కెట్‌ వ్యాపారులు బుధవారం దుకాణాలను మూసివేసి బంద్‌ పాటించారు. వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి మెయిన్‌ రోడ్‌లో నిరసన తెలిపారు. మార్కెట్‌ లోపల ఉన్న సుమారు 200 దుకాణాల యజమానులు, వాటిలో పని చేస్తున్న సిబ్బంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్‌ వల్లభారు పటేల్‌ మార్కెట్‌ వర్తక సంఘం (పూర్ణ మార్కెట్‌) అధ్యక్షుడు కొండా రామకృష్ణ మాట్లాడుతూ మార్కెట్‌ను ఆనుకొని ఉన్న పార్కింగ్‌ స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకొని అనేకమంది వ్యాపారాలు చేస్తున్నారని, వారికి పూర్ణ మార్కెట్‌ వ్యాపారంతో సంబంధం లేదని తెలిపారు. ఇష్టం వచ్చిన పద్ధతిలో రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నందున, ఈ ప్రాంతంలో మార్కెట్‌ పనిపై వచ్చే వారి వాహనాలు పార్కింగ్‌ చేయడానికి స్థలం ఉండటం లేదని, నిత్యం అన్ని రకాల రాకపోకలకు అవరోధం కలుగుతుందని చెప్పారు. మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులు లోపలికి రాకుండా ఆక్రమిత స్థలాల్లో ఉన్న వ్యాపారుల వద్దనే అన్ని రకాల సరుకులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇందువల్ల తాము వ్యాపారాలు లేక నష్టపోతున్నామన్నారు. అక్రమ వ్యాపారాలకు పోలీసులు, జివిఎంసి అధికారులు సహాయం అందిస్తున్నారని ఆరోపించారు. తమకు జరుగుతున్న నష్టం గురించి, ప్రజలకు జరుగుతున్న అసౌకర్యం గురించి పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. తప్పనిసరి పరిస్థితులలో మార్కెట్‌ బందు చేయాల్సి వచ్చిందని చెప్పారు. నాలుగో జోన్‌ కమిషనర్‌ చక్రవర్తి, 35వ వార్డు కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావు సంఘటనా స్థలానికి వచ్చి వ్యాపారస్తులతో చర్చలు జరిపారు. చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడంతో వ్యాపారులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కొత్త సంఘం నాయకుడు గోపాల్‌ పాల్గొన్నారు.