Nov 03,2023 21:57

పట్టణ ప్రణాళిక విబాగంలో తనఖీలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు

         -హిందూపురం : హిందూపురం మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో ముగ్గురు ఎసిబి సిఐలు, ఒక ఎస్‌ఐ, 13 మంది సిబ్బంది బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. పట్టణంలో ఇళ్ల నిర్మాణాలు, లే అవుట్‌ అప్రువల్‌ తదితర వాటికి ధరఖాస్తు చేసుకున్న వాటిని కంప్యూటర్‌, ధరఖాస్తులను పరిశీలన చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విశ్వనీయ వర్గాల ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. పరిశీలన అనంతరం ఎసిబి సిఐ మోహన్‌ ప్రసాద్‌ మాట్లాడుతు హిందూపురం పురపాలక సంఘంలో నిర్మాణాలకు అప్రూవల్‌ ఆలస్యం అవ్వడం, అప్రూవల్‌ కోసం అధికంగా డబ్బు వసూలు చేయడం, అనాధికారికంగా నివాస గహాలు, భవనాలు, రేకుల షెడ్లు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులు టోల్‌ ఫ్రీ నెంబర్‌14400కు ఫిర్యాదు చేశారన్నారు. ఇదే విషయంపై వివిధ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయన్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో రికార్డులను క్షుణ్నంగా పరిశీలన చేస్తే రూ.46వేలు లెక్క చూపనట్లు గుర్తించామన్నారు. ఇంకా పలు రికార్డులను పరిశీలన చేస్తున్నామన్నారు. రికార్డులను పరిశీలన చేస్తూనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ధరఖాస్తుదారులతోనూ మాట్లాడుతామని చెప్పారు. తనిఖీల అనంతరం ఏమైనా అవినీతి అక్రమాలు, లోటు పాట్లు ఉంటే ఉన్నతాధికారులకు సమచారం ఇచ్చి వారి సూచనల మేరకు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో సిఐ మోహన్‌ ప్రసాద్‌తో పాటు సిఐలు ప్రభాకర్‌, శాంతిలాల్‌, ఎస్‌ఐ నరేంద్ర, 13 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఎసిబి అధికారుల రాకతో మున్సిపల్‌ అధికారుల పరార్‌
మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం రాకతో మున్సిపల్‌ కార్యాలయంలోని ఆయా విభాగాల్లో అధికారులు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు. ఎసిబి అధికారుల తనిఖీల నేపథ్యంలో పట్టణ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఎసిపి) కార్యాలయం నుంచి వెళ్లి పోయారు. కార్యలయానికి రావాలని సెల్‌ ఫోన్‌ ద్వారా సమచారం ఇచ్చినప్పటికీ ఆయన వస్తాను అన్ని చెప్పారే తప్పా సాయంత్రం అయినప్పటికీ రాలేదు. ప్రధాన విభాగంలో విధులు నిర్వహిస్తున్న క్లరికల్‌ సిబ్బంది కూడా ఒక్కొక్కరుగా జారుకున్నారు. రెవెన్యూ విభాగం గదిని ఎకంగా మూసివేశారు. మెప్మా, అకౌంటింగ్‌ విభాగాల్లో అధికారులు ఏ ఒక్కరూ కనిపించలేదు. ఎసిబి అధికారుల దెబ్బకు అధికారులతో పాటు కార్యాలయంలో కనీసం అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం మాయం అయ్యారు. ఎసిబి అధికారులు వస్తే మున్సిపల్‌ అధికారులు అందరూ ఎందుకు కార్యాలయం నుంచి వెళ్లిపోయారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పురం మున్సిపాల్టీలో పెద్ద ఎత్తున అవినీతి కార్యకలాపాలు జరుగుతండడం వల్లనే ఎసిబి అధికారుల దెబ్బకు మున్సిపల్‌ సిబ్బంది ఎవరూ కార్యాలయంలోకి వచ్చే సాహసం చేయలేదనే వాదన విన్పిస్తోంది.