Jul 22,2023 23:12

కాలినడకన వస్తున్న గర్భిణి తనూజ

- రహదారి సౌకర్యం లేక గిరిజన గర్భిణికి అవస్థలు
ప్రజాశక్తి - మెళియాపుట్టి: 
పాలకులు చెప్తున్న అభివృద్ధి ప్రవచనాలు గిరిసీమల దరికి చేరడం లేదు. ఇందుకు మండలంలోని కేరాసింగిలో శనివారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. ఎత్తయిన కొండలపై ఉన్న కేరాసింగి గ్రామానికి చెందిన గర్భిణి గొడ్డూరు తనూజకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పుల తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. ఆ గ్రామానికి నేటికీ పూర్తిస్థాయి రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామంలోకి వెళ్లే వీల్లేక కిలోమీటరు దూరంలోనే 108 ఆగిపోవాల్సి వచ్చింది. మరోవైపు జోరున కురుస్తున్న వర్షంలో ఆశా కార్యకర్త సహకారంతో కుటుంబసభ్యులు గొడుగులు పట్టగా, పురిటినొప్పులతోనే కిలోమీటరు దూరం జారు బురదలోనే నడిచింది. బాధను పంటిబిగువున భరిస్తూ 108 వాహనం వద్దకు చేరుకుంది. అనంతరం ఆమెను టెక్కలిలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యం, ఇతర అత్యవసర సమయాల్లో గిరిజనులకు ఇలాంటి అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.