ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని రామదుర్గం గ్రామంలో పురాతన కాలం నాటి వాటర్ ట్యాంకును కూల్చివేశారు. కూలడానికి సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంకును సర్పంచి రోహిణి, గ్రామ పెద్దలు చెప్పిన విధంగా ఎవరికీ అపాయం జరగకూడదని శనివారం తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఇఒఆర్‌డి సంజన, ఆర్‌డబ్ల్యుసి ఎఇ రామ్ నీల, పంచాయతీ కార్యదర్శి సిసింద్రీ, రెవెన్యూ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో జెసిబి ద్వారా కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్యాంకు సమీపంలో నివాసం ఉన్న కుటుంబాలకు ఏమాత్రం అపాయం కలుగకుండా, విద్యుత్ తీగలను తొలగించి కూల్చివేత కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వాటర్ ట్యాంకు కూలడానికి సిద్ధంగా ఉందని, ఎప్పుడైనా, ఎవరికైనా అపాయం జరగవచ్చని పలుమార్లు జరిగిన గ్రామసభల్లో గ్రామ పెద్దలు అధికారుల దృష్టికి తెచ్చారని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేత చేపట్టామని తెలిపారు. వైసిపి నాయకులు ఈరప్ప, పోలీసు ఖాదర్ వలీ పాల్గొన్నారు.
రామదుర్గంలో వాటర్ ట్యాంకును జెసిబి ద్వారా కూల్చివేస్తున్న అధికారులు










