వేలేరుపాడు మండలంలో నిర్వాసితుల దుస్థితి - పోలవరం పోరుకేక పాదయాత్రలో జనం గగ్గోలు - 20 శాతం కుటుంబాలకూ అందని వరద పరిహారం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఎంతటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో.. వేలేరుపాడు మండలంలోని ప్రజల గోడు వింటే తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏ గ్రామాలు ముంపులో ఉన్నాయి, ఏ గ్రామాలు ముంపులో లేవనే విషయాలను కూడా ప్రభుత్వం తేల్చలేకపోయింది. పునరావాసం గురించి పట్టించుకోని ప్రభుత్వం గతేడాది వరదల పరిహారం కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. మండలంలోని రుద్రమ్మకోట గ్రామంలో గత వరదలకు ఇళ్లు కూలిపోయిన వారికి నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. 450 కుటుంబాలకుగాను 150 కుటుంబాలకే నష్ట పరిహారం అందింది. ఈ గ్రామంలోని గిరిజనులకు ఇప్పటికీ పునరావాస గ్రామం నిర్మాణం, నష్ట పరిహారంగాని అందించలేదు. వసంతవాడ సుందరయ్యనగర్‌లో 50 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకూ వరద సహాయం అరకొరగానే అందింది. గుంపన్నగూడెం గ్రామం ముంపులో ఉండగా ఆ గ్రామాన్ని 45.72 కాంటూరులో చేర్చారు. ఇక్కడ 50 కుటుంబాలు ఉండగా వరద సాయం సక్రమంగా అందని పరిస్థితి ఉంది. మద్దిగట్లగూడెం గ్రామాన్ని సైతం 45.72 కాంటూరులో చేర్చడంతో ఆ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామంలో 160 కుటుంబాలకుగాను 50 కుటుంబాలకే పరిహారం అందింది. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి కూడా నష్టపరిహారం అందించలేదు. నిర్వాసితులకు పునరావాస కాలనీ పూర్తిస్థాయిలో నిర్మించలేదు. నడిమికొమ్ము గ్రామంలో 22 దళిత కుటుంబాలు ముంపులో ఉండగా 41.15 కాంటూరులో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్వే నెంబర్ 385లో సుమారు 60 ఎకరాలు ఉన్నప్పటికీ భూ పరిహారం ఇవ్వలేదు. గ్రామంలో గిరిజనేతరులకు నిర్వాసిత కాలనీ సైతం నిర్మించలేదు. తోటగొమ్ము గ్రామంలో 97 కుటుంబాలు ఉండగా 25 కుటుంబాలకే వరద పరిహారం అందించారు. గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు, ఇతర సాయం ఏదీ అందించలేదు. ఈ గ్రామస్తులకు నిర్మించిన పునరావాస కాలనీలో ఎటువంటి సౌకర్యాలూ కల్పించలేదు. ఆసుపత్రి కాలనీ గ్రామాన్ని సైతం 41.15 కాంటూరులో చేర్చాల్సి ఉన్నప్పటికీ చేర్చలేదు. ఇక్కడ వరద పరిహారంగాని, గిరిజనేతరులకు పరిహారంగాని ఇవ్వలేదు.
కన్నాయిగుట్ట గ్రామంలోనూ ఇదే పరిస్థితి. పడమటమెట్ట గూడెంలో ఊరు మొత్తం మునిగినా 45.72 కాంటూరులో చేర్చడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. 200 కుటుంబాలు ఉండగా వంద కుటుంబాలకే ఆర్థిక సాయం అరకొరగా అందింది. నిర్వాసిత కాలనీ ఏర్పాటు జరగలేదు. తాట్కూరుగొమ్ము కాలనీ, వసంతవాడ ఇలా అనేక గ్రామాల్లో పునరావాస పరిహారం గాని, భూములకు పరిహారం గాని ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే జులైలో మళ్లీ వరదలు వస్తే తమ పరిస్థితి ఏమిటా అని వారం తా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ మండలంలోకొచ్చిన 'పోలవరం పోరుకేక' మహా పాదయాత్ర బృందా నికి సమస్యలపై వినతులు అందించి న్యాయం చేయాలని కోరారు.










