
ప్రజాశక్తి - కుక్కునూరు
వరద ముంపు గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించాలని జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. మండలంలో వరద ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఆమె గురువారం పర్యటించారు. ముందుగా దాచారంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న భోజనం, వసతి సదుపాయాలను పరిశీలించారు. మండలంలోని గొమ్ముగూడేనికి చెందిన 253 కుటుంబాలకు చెందిన 743 మంది, వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామానికి చెందిన 205 కుటుంబాలకు చెందిన 611 మందిని పునరావాస కేంద్రానికి తరలించామని, వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని, తాగునీటికి ఇబ్బంది లేకుండా రెండు బోర్లు వేసినట్లు అధికారులు జెసికి తెలిపారు. పునరావాస కేంద్రంలో ప్రజలకు వరద సాధారణ పరిస్థితి వచ్చే వరకూ భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జెసి సూచించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. కేంద్రంలో సంపూర్ణ పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాటు చేయాలని అధికారులను జెసి ఆదేశించారు.
అనంతరం కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయంలో వరద పునరావాస కార్యక్రమాలపై అధికారులతో జెసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ముంపునకు గురికాకుండా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. వరద అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వేలేరుపాడు మండలంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను, కుక్కునూరు మండలంలో ఒక ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధం చేశామన్నారు. వరద కారణంగా రవాణా మార్గానికి అంతరాయం ఏర్పడిన గ్రామాల్లోని విఆర్‌ఒ, పంచాయతీ కార్యదర్శి, విఆర్‌ఎలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మండల అధికారులకు సమాచారం అందించాలన్నారు. జెసి వెంట నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఐటిడిఎ పిఒ సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ జాన్సీరాణి, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, వివిధ శాఖల అధికారులున్నారు. దాచారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని వరద పునరావాస కేంద్రంలో ప్రజలకు అధికారులు స్వయంగా భోజనం వడ్డించారు.