Aug 12,2023 21:32

ప్రజాశక్తి - భీమవరం
            ఇటీవల గోదావరి వరద కారణంగా పునరావాసం పొందిన ప్రతి కుటుంబానికి నగదు జమ చేసినట్లు కలెక్టర్‌ పి.ప్రశాంతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొంది తిరిగి ఇంటికి వెళ్లే వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు, కుటుంబంలో ఒక్కరే ఉంటే రూ.వెయ్యి ఆయా కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన దొడ్డిపట్ల గ్రామంలోని 204 కుటుంబాలకు రూ.2 వేల చొప్పున, సింగిల్‌ పర్సన్స్‌ ఎనిమిది మందికి రూ.వెయ్యి చొప్పున అందించినట్లు చెప్పారు. గతేడాది 72 అడుగుల మేర వరద రావడంతో చాలా గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరిందని, గత నెలలో వరదలకు ఆ పరిస్థితి లేదన్నారు. వరద 54 అడుగులు రావడం వల్ల చాలా గ్రామాల్లో ఇంట్లోకి నీరు ప్రవేశించలేదని, ఇంటి చుట్టూ ఉన్న పల్లపు ప్రాంతాల్లో మాత్రమే నీరు చేరిందని తెలిపారు. యలమంచిలి మండలంలోని కనకాయలంక, పెదలంక, లక్ష్మిపాలెం, యలమంచిలి లంక, ఏనుగువాని లంక, గంగడుపాలెం, అబ్బిరాజుపాలెం, నార్ని మెరక, బాడవ, శిరగాలపల్లి, కంచుస్తంభంపాలెం, బూరుగుపల్లి గ్రామాల ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చి రాకపోకలు సాగించడానికి అంతరాయం ఏర్పడినందున వారందరికీ ఇంటి వద్దనే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు, తాగునీరు, వైద్య సహాయం అందించినట్లు చెప్పారు. 4,023 కుటుంబాలకు నిత్యావసర సరుకులు చౌక దుకాణాల ద్వారా గ్రామ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక్కొక్క కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, మంచినూనె ఒక లీటరు, వంకాయలు, పచ్చిమిర్చి కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద కారణంగా లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకూడదని వరద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి అధికార యంత్రాంగం అప్రమత్తమై తగు ముందస్తు చర్యలను చేపట్టిందన్నారు. వరద సహాయ చర్యల్లో ఎటువంటి లోటు పాట్లు లేకుండా వరద తొలగే వరకూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. వరద తొలగిన అనంతరం మెరుగైన పారిశుధ్య కార్యక్రమాలను కూడా చేపట్టి ఆయా గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచినట్లు కలెక్టర్‌ తెలిపారు.