Nov 04,2022 21:32

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
               పోలవరం పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తహశీల్దార్‌ ఎస్‌ఎస్‌.శాంతి తెలిపారు. శుక్రవారం మండలంలోని ముప్పినవారిగూడెం సమీపంలో చిగురుమామిడి, చిగురుమామిడి కాలనీ, శ్రీరామపురం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీని ఆమె సందర్శించారు. గత నెల 25న తనకు అందిన వినతిపై పునరావాస కాలనీలో మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం మండల అధ్యక్షులు కారం భాస్కర్‌ మాట్లాడుతూ పునరావాస కాలనీలో మూడు గ్రామాలకు ఒక్కటే వాటర్‌ ట్యాంక్‌ ఉందన్నారు. గ్రామాలవారీగా వాటర్‌ ట్యాంక్‌ నిర్మించాలన్నారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రం, పాఠశాల భవనాలు, దేవాలయాలు, కమ్యూనిటీ హల్‌, దుకాణాలు, ప్రభుత్వ భవనాలు వంటివి గ్రామాల వారీగా ఇంకా నిర్మాణం చేపట్టలేదన్నారు. చిన్నపాటి వర్షానికి పొలాల నుండి వరద నీరు ఇళ్ల మధ్యకు చేరి నిలిపోతుందని, తక్షణమే కాలనీ చుట్టూ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కురిసిన వర్షాలకు సెప్టిక్‌ ట్యాంకులు నిండిపోయి మరుగుదొడ్లు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. నిర్వాసితులు రేషన్‌ బియ్యం కోసం 80 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందన్నారు. శ్మశానవాటిక స్థలాలు, పశుగ్రాసం కోసం భూమిని కేటాయించ లేదని అన్నారు. దీనిపై తహశీల్దార్‌ శాంతి నిర్వాసితులతో మాట్లాడుతూ పునరావాస కాలనీలో సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటనాగవరం విఆర్‌ఒ పి.నాగేశ్వరరావు, నిర్వాసితులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.