
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, గోకవరం పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో సమస్యలు తిష్ట వేశాయి. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చట్టాలు ఉన్నా అవి నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయి. కాలనీల్లో గృహాలను నిర్మించి రెండేళ్లు గడిచినా నేటికీ నిర్వాసితులను తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది. పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. ఓవైపు అప్రకటిత విద్యుత్ కోతలు, మరోవైపు దొంగల భయం నిర్వాసితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
బహుళార్ధక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులు నేడు అష్టకష్టాలను అనుభవిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల దేవిపట్నం మండలంలోని 36 గ్రామాల నిర్వాసితుల్లో గిరిజనేతరులకు కృష్ణునిపాలెంలోనూ, గిరిజనులకు దేవిపట్నం, గోకవరం మండలాల్లో 14 పునరావాస కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించారు. ఈ కాలనీలు నిర్మించి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడిన దాఖలాలు లేవు. ఈ కాలనీలను స్థానిక పంచాయితీల్లోకి విలీనం చేయకపోవటమే ఈ దుస్థితి కారణమని బాధితులు పేర్కొంటున్నారు. ఇందుకూరుపేట-1 పునరావాస కాలనీ (షెడ్యూలు కాలనీ)లో గతేడాది కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. కాలనీల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని నిర్వాసితులు వాపోతున్నారు.
వేసవి ముందే ఎక్కిళ్లు
పునరావాస కాలనీల్లో వేసవికి ముందే ఎక్కిళ్లు మొదలయ్యాయి. దేవిపట్న మండలంలో కొండమొదలు లోని 6 గ్రామాలు మినహా మిగి లిన 38 గ్రామాలను 14 ఆర్ అండ్ ఆర్ (పునరావాస) కాలనీలకు తరలించారు. ఈ కాలనీల్లో కుళాయిలకు ప్రత్యామ్నాయంగా ఎక్కడా కూడా చేతి పంపులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు పెద్ద భీంపల్లి-2 కాలనీలో 67 గృహాలు నిర్మించగా 40 గిరిజన కుటుంబాలకు పునరావసం కల్పించారు. కుళాయి నీరు రెండ్రోజులకోసారి ఇస్తున్నారు. అదే ప్రాంతంలోని చిన్నారి గండి గ్రామంలో వాటర్ ట్యాంక్ గేటు వాలు పగిలిపోయి ఈ వారంలో నాలుగు రోజులపాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాపరాల పల్లిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. నిర్వాసితుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఎట్టకేలకు ఇటీవల సోలార్ బోరు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సత్య సాయి ట్రస్టు అంద జేసే తాగునీటి కోసం పెద్ద భీంపల్లి-2 వాసులు రోజూ కిలోమీటరు దూరం నడిచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదే విధంగా గిరిజనేతరులకు గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీలో 1065 కుటుంబాలకు గృహాలు కేటాయించారు. తాగునీటి కోసం ద్విచక్ర వాహనంపై 2 కిలోమీటర్లు దూరంలోని గోకవరం వెళ్లాల్సివస్తుంది. ఇక్కడ ఒంటరి మహిళలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో చీ'కట్'లు
పునరావాస కాలనీల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతి రోజూ ఉదయం కనీసం 2 నుంచి 4 గంటల వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. గత వారంలో రాత్రివేళ 3 గంటలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణుణిపాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీలో 18 గ్రామాల వాసులకు పునరావాసం కల్పించారు. అయితే మంటూరు, మడిపల్లి వాసుల కాలనీలో మాత్రమే వీధి దీపాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన గ్రామాల ప్రజల వీధుల్లో సాయంత్రం 6 గంటలకే చీకట్లు కమ్ముకుంటున్నాయి. షెడ్యూలు కాలనీలైన పెద్దబీంపల్లి-1,-2,-3 కాలనీల్లోనూ వీధి దీపాలు వెలగడం లేదు. మరో వైపు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ఎక్కడికక్కడే చెత్త నిలిచిపోతోంది. ఈ సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటికి తప్పని ఇబ్బందులు
దేవిపట్నం తొయ్యేరులో నివాసం ఉండే వాళ్లము. కృష్ణునిపాలెంలో పునరావాసం కల్పించారు. ఆ ప్రాంతంలో కుళాయిలకు రెండ్రోజుల నుంచి నీరు రావడం లేదు. చేతిపంపులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము. తాగునీటి కోసం గోకవరం వెళ్లాల్సివస్తుంది. ఒంటరి మహిళలకు తాగునీరు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోతుంది. మరో వైపు దొంగల భjం వెంటాడుతోంది. పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. కాలనీలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోతోంది. పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించడం లేదు. దీంతో దోమల పెరిగిపోయి రోగాల భారిన పడుతున్నాము.
- దేవిశెట్టి శకుంతల, కృష్ణునిపాలెం, కాలనీ.నిరంతరం విద్యుత్ కోతలే...
పెద్ద భీంపల్లి-2లో ప్రభుత్వం పునరావాసం కల్పించింది. కాలనీలో కుళాయిలు ఉన్నప్పటికీ నీరు రావడం లేదు. కొన్నిసార్లు నీరు ఇచ్చినా అవి ఉప్పుగా ఉండటంతో తాగలేకపోతున్నాయి. ప్రతి రోజూ సత్యసాయి ట్రస్టు నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నాం. తరచూ విద్యుత్ అంతరాయాలు తలెత్తుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించడం లేదు. పునరావాస కాలనీల్లో అభివృద్ధి కమిటీ సమావేశాల్లో సమస్యలు ప్రస్తావించినా ఫలితం ఉండటం లేదు. -కారం రామన్న దొర, పెద భీంపల్లి -2 కాలనీ.