Oct 14,2023 21:24

కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి నాగరాజు

         ప్రజాశక్తి-అనంతపురం సిటీ    అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు పునాది స్థాయిలోనే మంచి విద్యాబోధన చేయాలని డిఇఒ నాగరాజు సూచించారు. అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాస్థాయిలో డిఆర్‌పిలకు ఏర్పాటు చేసిన శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకొన్న అంశాలను మండలాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు సమర్థవంతంగా అందించాలని సూచించారు. ఎందుకంటే పునాది స్థాయిలో పిల్లలకు అక్షరాలు, అంకెలు బాగా నేర్పిస్తే ఉన్నత తరగతుల్లో అభ్యాసం సులభంగా ఉంటుందన్నారు. అలాగే ఎంపిక చేసిన పాఠశాలల్లో 3,6,9 తరగతుల పిల్లలకు నవంబర్‌ 3వ తేదీన స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అసెస్మెంట్‌ సర్వే (ఎస్‌ఇఎస్‌) జరుగుతుందన్నారు. దసరా సెలవుల తర్వాత పిల్లలతో బాగా ప్రాక్టీస్‌ చేయించి రాష్ట్రస్థాయిలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈఆర్‌టి ప్రతినిధి కేశవరెడ్డి, డైట్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, ఎఎంఒ చంద్రశేఖర్‌రెడ్డి, జిసిడిఒ మహేశ్వరి, నలుగురు ఎంఇఒలు, అసిస్టెంట్‌ ఎఎంఒలు పాల్గొన్నారు.