Aug 17,2023 20:53

డిఎఫ్‌ఒ కార్యాలయ అధికారికి వినతిని అందజేస్తున్న సిపిఎం నాయకులు

బెలగాం: జిల్లాలో పులులు, ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని సిపిఎం నాయకులు జిల్లా అటవీశాఖాధికారులకు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ జిల్లాలో సీతంపేట, భామిని మండలాలతో పాటు ఆ చుట్టుప్రక్కల పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారని, ఈరోజు హిరమండలం ప్రాంతంలోని తోటల్లో సంచరిస్తున్నట్లు వీడియోలో తెలుస్తుందని పేర్కొన్నారు. సాలూరు, గరుగుబిల్లి మండలాల్లో కూడా సంచరించే ఆనవాళ్ళు కనిపిస్తున్నట్లు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్‌ పేరుతో ఒడిశాలో క్వారీ శబ్దాలతో ఏనుగులు, పెద్దపులులు మైదాన ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉందని ఇక్కడ తోటల్లో, చెట్లు ఉన్న ప్రాంతాలకు చేరుతున్నాయన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యమేనని, గిరిజన వ్యతిరేక చట్టాలు మైనింగ్‌ కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా చేసే చట్టాలు వెంటనే రద్దు చేయాలని, పెద్దపుల్ని, ఏనుగుల్ని అడవికి పంపించే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అటవీశాఖ కార్యాలయ ఎఒ చంద్రశేఖర్‌కు వినతిని అందజేశారు. వినతిని అందజేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు, వై.మన్మధరావు ఉన్నారు.