Oct 13,2023 21:52

పులివెందుల పోలీసులపై సస్పెన్షన్‌

పులివెందుల టౌన్‌ : పోలీస్‌ శాఖలో అక్రమాలకు, అవినీతికి పాల్పడిన పోలీసులపై ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ కొరడా ఝళిపించారు. ఎస్‌ఐ సత్యనారాయణను విఆర్‌ పంపారు. అలాగే కానిస్టేబుల్‌ బి. నరసింహారెడ్డి (పిసి2737), హోమ్‌గార్డు జి .రవికుమార్‌ (హెచ్‌జి600)ను సస్పెండ్‌ చేసినట్లు ఎస్‌పి నుంచి పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం సమాచారం అందినట్లు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సిఐ రాజు తెలిపారు. వివరాలు.. పులివెందుల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ నరసింహారెడ్డి, హోమ్‌గార్డు రవికుమార్‌ ప్రజలను బెదిరిస్తూ బలవంతపు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలపై ఎస్‌పి విచారణకు ఆదేశించారు. విచారణలో వచ్చిన ఆరోపణలను నిజమని నిర్ధారణ కావడంతో వారిపై పులివెందుల పోలీస్‌ స్టేషన్‌ లో 484/2023 గా క్రిమినల్‌ కేసు నమోదు చేసి వారినీ విధులు నుండి సస్పెండ్‌ చేశారు.
పోలీస్‌ శాఖలో కలకలం
ఎస్‌ఐని విఆర్‌ కు పంపడం, కానిస్టేబుల్‌ , హోమ్‌గార్డును సస్పెండ్‌ చేసి , కేసు నమోదు చేయడం పై పోలీస్‌ శాఖలో కలకలం మొదలైంది. అక్రమాలకు అవినీతికి పాల్పడితే పోలీసులైనా, సామాన్యులైనా ఒకటేనని ఈ చర్యలు బట్టి తెలుస్తుంది. అధికారం ఉందని పోలీసులు అమాయకుల ప్రజల పైన తమ ప్రతాపాన్ని చూపించే వారు. ఈ చర్యలతో పోలీసులలో అలజడి మొదలైనట్టు తెలుస్తుంది. చిన్న చిన్న వ్యాపారులపై పోలీసుల తీరు సరిగా లేకపోవడంతో ఈ సంఘటన అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. తప్పు చేస్తే పోలీసులైనా, ప్రజలైనా ఒకటేనన్న నమ్మకాన్ని ప్రజల్లో నింపిన ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ కు ప్రజల నుంచి కతజ్ఞతలు వెల్లువెత్తాయి.