
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో అవసరం మేరకు వర్షాలు లేకపోవడం, కాల్వలకు చాలినంత నీటి సరఫరా లేక కృష్ణా డెల్టాలో సేద్యానికి ఈఏడాది నీటికొరత తీవ్ర రూపం దాలుస్తోంది. వరిపైరు పొట్టదశకు చేరుకుంటున్న సమయంలో నీటి సరఫరా సగానికి సగం తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి యాజమాన్య నిర్వహణ, తగిన ప్రణాళిక లేక ఏ ప్రాంతానికి పూర్తిస్థాయిలో నీరు సరఫరా కాని పరిస్థితి ఏర్పడుతోంది. పట్టిసీమ నుంచి నీటి సరఫరా తగ్గడం, పులిచింతలలో నీటి నిల్వలు పూర్తిగా లేకపోవడంతో ప్రకాశం బ్యారేజికి సరఫరా తగ్గింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజికి 6925 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. ఇందులో తూర్పు డెల్టాకు (ఉమ్మడి కృష్ణా జిల్లా) 3826 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా (గుంటూరు, బాపట్ల జిల్లాలు)కు 3,042 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌లకు 57 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గరిష్టంగా ఆరు వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తేనే కాల్వలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల జరుగుతుంది. కానీ మూడు వేల క్యూసెక్కులు విడుదల చేయడం వల్ల అరకొర నీటి సరఫరా జరుగుతుందని రైతులు వాపోతున్నారు. పులిచింతలలో గరిష్ట నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా శనివారం రాత్రికి 31.88 క్యూసెక్కుల నిల్వ ఉంది. ఇందులో 5 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో 41.83 టీఎంసీల నిల్వ ఉంది. అయితే ఈ ఏడాది 31.88 టీఎంసీలు నిల్వ ఉండటం వల్ల పూర్తిస్థాయిలో కాల్వలకు నీరు ఇవ్వకలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అంతేగాక రాబోయే రెండునెలల్లో ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం లేదు. ఇందువల్ల పొదుపుగా విడుదల చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఖరీఫ్‌లో మరో 16 టీఎంసిలు ఎలా ఇవ్వాలనే అంశంపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఖరీఫ్‌లో మొత్తం కృష్ణా డెల్టాకు 90 టీఎంసీలు అవసరంకాగా ఇప్పటి వరకు 74 టీఎంసీలు వినియోగించామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న 31 టీఎంసిల్లో 16 టీఎంసిలు వినియోగం కష్టంతో కూడుకున్న చర్యగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డెల్టా కాల్వలకు అరకొరగానీటి సరఫరా చేస్తున్నారు. దీంతో వేసిన పంటలు బెట్టకు వచ్చి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల జిల్లాల్లోని రేపల్లె, బాపట్ల, వేమూరు, చీరాల నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రాంతాల్లో పొట్టదశలో ఉంది. బాగా ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో ఎదుగుదల దశలో ఉంది. దీంతో ప్రస్తుతం నీటి అవసరం పెరిగింది. 15 రోజులుగా వర్షాల్లేవు. పట్టిసీమ నుంచి నీటి విడుదలను భారీగా తగ్గించారు. ప్రభుత్వం శ్రద్దచూపితే కొంత వరకు గోదావరి జలాలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నా ఈ దిశగా అడుగులు వేయడం లేదు. అరకొరగా నీటి విడుదల చేస్తుండటం, గత వేసవిలో జరగాల్సిన కాల్వల మరమ్మతులు సరిగా జరగకపోవడం చివరి భూములకు నీరందే పరిస్థితిలేక వరి పైరు ఎండిపోతోంది.