Nov 01,2023 01:30

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంటను కాపాడేందుకు ఎంతో ఉపయోగపడింది. దీంతో పులిచింతల జలాశయంలో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. పులిచింతల జలాశయం గరిష్టనీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా మంగళవారం సాయంత్రానికి 20.85 టిఎంసిల నీటి నిల్వ ఉంది. ఇంకా 10 టిఎంసిల వరకు వరి సాగుకు నీరు ఇవ్వాల్సి ఉందని, మిగతా 10 టిఎంసిలు రానున్న ఆరు నెలల్లో తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని అందువల్ల రబీ సాగుకు నీరు ఇచ్చే అవకాశాలు లేవని వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందువల్ల కేవలం మినుము, పెసర తప్ప ఇతరపంటలు వేయవద్దని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.
గతేడాది పులిచింతలలో ఇదే సమయానికి 40 టిఎంసిల నీరు నిల్వ ఉండగా ఈ ఏడాది ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడం వల్ల నీటి నిల్వ సగానికి సగం తగ్గింది. అంతేగాక సాగర్‌,శ్రీశైలంలో కూడా నీటి నిల్వ పెరగడం లేదు. సాగర్‌ జలాశయంలో గరిష్టనీటి నిల్వ 312.04 టిఎంసిలు కాగా 158 టిఎంసిల నిల్వ ఉంది. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి వల్ల 6342 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే స్థాయిలో కుడి, ఎడమ కాల్వలకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో గత ఏడాది ఇదేరోజుకు 311.74 టిఎంసిల నీరు నిల్వ ఉందని ఈ ఏడాది సగానికి తగ్గిపోయింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల కృష్ణా డెల్టాలో ఏర్పడిన సాగునీటి సంక్షోభం నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఒక వైపు పులిచింతల, మరో వైపు పట్టిసీమ పథకాలు ఉపయోగపడ్డాయి. ముందస్తుగా పట్టిసీమ నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకోకపోవడం వల్ల పులిచింతలలో నీటి నిల్వ బాగా తగ్గింది. పులిచింతలలో నీటి నిల్వ తగ్గడం వల్ల వర్షాభావం కొనసాగితే రబీ పంటలకు సాగు నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రబీ సాగుపై అయోమయ పరిస్థితి నెలకొంటోంది. ప్రధానంగా పశ్చిమ డెల్టా పరిధిలోగుంటూరు, బాపట్ల జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా రెండో పంటగా రబీ పంటలు జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులు సమాయత్తం అయ్యేందుకు నీటి సరఫరాపై అయోమయ పరిస్థితులునెలకొన్నాయి.
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా ఇందులో చివరి భూములకు నీరందక రెండు లక్షల ఎకరాల్లో వరిపైరు బెట్టకు వచ్చిన పరిస్థితినెలకొంది. వరి పైరు బెట్టకు రావడం వల్ల పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఎక్కువ మంది రైతులు ఆయిల్‌ ఇంజన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల రైతులకు ఖర్చులు పెరుగుతున్నాయి. వరి పొట్టదశకు రావడంతో నీటి అవసరం పెరిగింది. పట్టిసీమ నుంచి మూడు వేల క్యూసెక్కులు, పులిచింతల నుంచి 8 వేల క్యూసెక్కులు కలిపి మొత్తంగా 10,652 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు. ఇందులో పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కులు విడుదల అవుతోంది. చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.